ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినతులన్నీ పాతవే.. కేంద్రానికి మరోమారు సీఎం జగన్‌ విజ్ఞప్తి - CM Jagan appeal to center on special status

CM Jagan met with Modi: పోలవరం, ప్రత్యేక హోదాపై కేంద్రానికి మరోమారు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన జగన్‌.. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. అయితే ప్రధానమంత్రితో సీఎం ప్రస్తావించిన అంశాలు అంటూ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీల వంటి అంశాలే యథాతథంగా ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్‌, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి అంశాలు కనిపించలేదు.

CM Jagan met with Modi
CM Jagan met with Modi

By

Published : Mar 18, 2023, 12:38 PM IST

CM Jagan met with Modi: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటనలో పాత అంశాలే తెరపైకి వచ్చాయి. గురువారం దిల్లీ చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 40 నిమిషాలపాటు భేటీ సాగింది. ఎంపీలందరితో కలిసి పార్లమెంటుకు వళ్లగా.. ప్రధానమంత్రి వద్దకు మాత్రం ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కరితో మాత్రమే కలిసి వెళ్లారు. ప్రధానితో కలిసి ఫొటో దిగిన అనంతరం విజయసాయి కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రధానితో ముఖ్యమంత్రి ఒక్కరే ఏకాంతంగా మాట్లాడారు. ఆ భేటీ అనంతరం వైసీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కొద్ది సమయం ఎంపీలతో కూర్చొని వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మళ్లీ పార్లమెంటుకు వచ్చి అమిత్‌షాతో భేటీ అయ్యారు. జగన్​తో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్యకార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలందరూ కనిపించినప్పటికీ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాత్రం రాలేదు. ప్రధానిని ముఖ్యమంత్రి కలిసి వెళ్లిపోయిన తర్వాత అవినాష్‌రెడ్డి ఒక్కరే వాహనంలో పార్లమెంటు ఆవరణ నుంచి బయటికి వెళ్లడం కనిపించింది. ప్రధానికి అందించిన వినతిపత్రాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. అయితే ప్రధానమంత్రితో సీఎం ప్రస్తావించిన అంశాలు అని సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీల వంటి పాత అంశాలే ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్‌, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ లాంటి అంశాలు అందులో కనిపించలేదు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదల చేసిన వివరాలు..

1. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకూ చాలా అంశాలు పెండింగులోనే ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి ఇంకా నోచుకోలేదు.

2. కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినా.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని కీలకాంశాలన్నీ పెండింగులోనే ఉన్నాయి.

3. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రావాల్సిన 36,625 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలివ్వాలి.

4. గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందనే కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణపరిమితిపై ఆంక్షలు విధించారు. 2021-2022లో 42,472 కోట్ల రూపాయల రుణపరిమితి కల్పించి, తర్వాత అందులో రూ.17,923 కోట్లు తగ్గించారు. దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి.

5. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నాయి. కేంద్రం కూడా తగిన సహకారం అందిస్తే కొద్దిసమయంలోనే ఇది వాస్తవ రూపం దాలుస్తుంది. దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టిన రూ.2600.74 కోట్లను కేంద్రం చెల్లించాలి. టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన రూ.55,548 కోట్ల పోలవరం అంచనా నిధులను వెంటనే ఆమోదించాలి. తాగునీటి సరఫరా అంశాన్నీ ఇందులో భాగంగానే చూడాలి. ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంపొనెంట్‌ వారీగా చూసే నిబంధనలను సడలించాలి. ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం పెరిగుతోంది కాబట్టి ముంపుకు గురయిన బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చేందుకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిని పాటించాలి. పోలవరం నిర్మాణం మరింత వేగవంతం చేసేందుకు తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి.

6. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ విద్యుత్తుకు సంబంధించిన తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.7,058 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలి.

7. జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత పాటించకపోవడం వల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే రేషన్‌ ఇస్తోంది. దాదాపుగా రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏపీ విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్‌ కూడా నిర్ణయించిన క్రమంలో రేషన్‌ కోటాను రాష్ట్రానికి కేటాయించాలి.

8. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఏపీకి కేంద్రం హామీ ఇచ్చింది. అభివృద్ది దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు సహాయ పడేలా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.

9. రాష్ట్రంలో ఉన్న జిల్లాలను 13 నుంచి 26కి పెంచా. కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు వైద్య కళాశాలలతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 14 కళాశాలలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 జిల్లాలకు వీలైనంత త్వరగా మరి కోన్ని కళాశాలలు మంజూరు చేయాలి.

10. వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ పెడతామని కేంద్రం ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్‌ పూర్తవ్వాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details