అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ అగ్రికల్చర్ మిషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కౌలు రైతులకూ రైతు భరోసా.. అవసరమైతే చట్ట సవరణ
అగ్రికల్చర్ మిషన్ సభ్యులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది.
ఇక నుంచి ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశం నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.వ్యవసాయ మిషన్ పరిధిలోనే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నామని అన్నారు.పెట్టుబడి రాయితీ, విత్తనాల లోటు లేకుండా ప్రణాళికలు చేపట్టాలని.. పగలు 9 గంటలు నిరంతరాయ విద్యుత్ కోసం 60 శాతం ఫీడర్ల అధునీకరించాలని నిర్ణయించారు.ఫీడర్ల అధునీకరణ కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు.రైతు సహకార సంఘాల ఎన్నికలు త్వరలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు నాగిరెడ్డి తెలిపారు.
నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.గతంలో నామినేట్ చేసిన వ్యక్తులే కొనసాగుతున్నారని.. వాటిని ఇప్పటికే రద్దు చేశామన్నారు. కౌలు రైతులకూ రైతు భరోసా అమలు చేస్తామని.. అవసరమైతే చట్ట సవరణ చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని నాగిరెడ్డి తెలిపారు.వచ్చే సీజన్‌లో విత్తన సరఫరా కోసం ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను రైతు దినోత్సవం రోజు అమలు చేస్తామని తెలిపారు.