Jagan Govt Illegal Calculations on School Students:2021 జనవరి 12న నెల్లూరులో 'అమ్మఒడి' రెండో విడత జమ చేసిన సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ అనేక పాఠశాలల గురించి గొప్పలు చెప్పారు. కానీ వాస్తవంగా జరుగుతున్నదేంటో పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. లేని విద్యార్థులను ఉన్నట్లు చూపి, అందరూ బడికి వచ్చేలా చూడాలంటూ ప్రచారం చేయడంలో జగన్ను మించిన వారుండరేమో. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి గత డిసెంబరు వరకు విద్యార్థుల హాజరు సరాసరిన 78.12శాతం మాత్రమే ఉంది. ఇంతమంది విద్యార్థులు బడికి రాకపోయినా కనీసం వీరు ఎక్కడున్నారనే విషయాన్ని జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో మూడు, నాలుగేళ్లుగా లేని విద్యార్థుల పేరిట అక్రమ దందా కొనసాగుతోంది. ఉపాధి హామీ కూలి పనుల కోసం చాలామంది వలస బాట పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు మధ్యలో చదువు మానేసి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిపోతున్నారు. మరికొందరు బాలికలు చిన్నవయస్సులోనే వివాహాలు చేసుకుని బడులను వీడుతున్నారు. వారి పేర్లు తొలగించకపోవడం వల్ల ఇప్పటికీ రికార్డుల్లోనే కొనసాగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఎక్కువ రోజులుగా బడికిరాని విద్యార్థుల వివరాలను ఛైల్డ్ ఇన్ఫో కాలం నుంచి తొలగించి, డ్రాపౌట్ బాక్సులో వేయడంతో అదృశ్య విద్యార్థుల జాబితా అధికారికంగా బయట పడింది. ఒక్కో బడిలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు తేలింది. ఆన్లైన్ హాజరు యాప్లో అందరి విద్యార్థుల పేర్లు కనిపించకపోవడంతో ఈ సమాచారం బయటకు వచ్చింది.
Student Calculations in Records:
- కర్నూలు జిల్లాలో ఓ స్కూళ్లో రికార్డుల ప్రకారం 310మందికిపైగా విద్యార్థులు నమోదయ్యారు. వీరిలో క్రమం తప్పకుండా, అడపాదడపా వస్తున్న విద్యార్థులు 239 మంది కాగా మిగిలిన 71 మంది గత మూడు, నాలుగేళ్లుగా పాఠశాల ముఖమే చూడలేదు. అయినా వీరు బడిలోనే చదువుతున్నట్లే లెక్కలో చూపారు.
- నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఓ పాఠశాలలో 500 మందికిపైగా విద్యార్థులు ఉంటే ఇప్పుడు ఆన్లైన్ హాజరు యాప్లో కనిపిస్తోంది 482మంది పేర్లే. ఈ పాఠశాలల్లో 37మంది అదృశ్య విద్యార్థులున్నారు. విచిత్రమేమిటంటే ఇక్కడ 500కుపైగా విద్యాకానుకలు ఇచ్చినట్లు బయోమెట్రిక్ కూడా నమోదు చేశారు.
- తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాఠశాలలు పునఃప్రారంభం నుంచి రావడం లేదు. ఇంతకాలం వారు చదువుతున్నట్లు చూపి ఇప్పుడు ఆన్లైన్ హాజరు యాప్లో డ్రాపౌట్ బాక్సులోకి చేర్చారు.
- కడప జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలలో 12మంది విద్యార్థులు బడికి రాకున్నా ఇంతకాలం వస్తున్నట్లే లెక్కలు చూపారు. విచిత్రమేమిటంటే నలుగురు పదోతరగతికి పరీక్ష ఫీజు కట్టారు. ప్రతిబడిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.
- 2022-23లో పదో తరగతి తప్పిన లక్షా 23వేల మంది విద్యార్థుల్లో లక్షా 3వేల మంది పునఃప్రవేశాలు పొందినట్లు అధికారులు చూపుతున్నారు. ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చిన పరీక్ష ఫీజు కట్టించారు. వీరిలో 10శాతం కూడా రెగ్యులర్గా బడికి రావడం లేదు. అధికారులు మాత్రం వీరికి విద్యా కానుక ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు.