BJP leader Kanna fire on CM Jagan: ఎస్సీ కార్పొరేషన్ నిధులను వేరే పథకాలకు మళ్లించకూడదని గతంలో చట్టం ఉన్నప్పటికీ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద అమలు జరగాల్సిన 26 పథకాలను రద్దు చేశారని, రద్దు చేసిన ఆ 26 పథకాలను మళ్లీ అమలు చేయాలంటూ.. గుంటూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 48 గంటల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా మహారాష్ట్రకు చెందిన శంభునాధ్ తుండియా, రాష్ట్ర సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వింత పోకడ కనిపిస్తుందని... చాక్లెట్ ఇచ్చి నిలువునా దోపిడీ చేస్తున్నారని కన్నా ఎద్దేవా చేశారు. జగన్‌ది మోసపూరిత వ్యాపార దృక్పథమని... ప్రజల సొమ్మును ప్రజలకే పంచిపెడుతూ సంక్షేమం అంటూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పోలీసు వ్యవస్థను ఇంతలా దిగజార్చిన ఘనత జగన్‌దేనని కన్నా విమర్శించారు.