ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నీకు 100 - నాకు 11'.. హిందూజాలో జగన్ దోపిడి!

జగన్‌ ఆస్తుల కేసు దర్యాప్తునకు సంబంధించిన కీలక ఆధారం ఒకటి బయటకొచ్చింది. జగన్ దోపిడీని నిర్థారిస్తూ.. ఈడీ డైరెక్టరు కర్నల్‌సింగ్‌ రెండేళ్ల కిందట సీబీఐకి రాసిన లేఖ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. కేంద్రంతో కుమ్మక్కు కారణంగానే జగన్ తప్పించుకుంటున్నారని తెదేపా ఆరోపిస్తోంది. తాజాగా బయటకొచ్చిన పాతలేఖ ఎన్నికల ముంగిట.. ప్రతిపక్షనేతను ఇరకాటంలోకి నెట్టింది.

జగన్

By

Published : Mar 13, 2019, 12:24 PM IST

ఎన్నికల వేళ.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చిక్కుల్లో పడ్డారు. అక్రమాస్తుల వ్యవహారంలో ఆయన అవినీతిని నిర్థారిస్తూ ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇదే లేఖ..ప్రత్యర్థి తెదేపాకు ప్రధాన ఆయుధంగా మారింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ విచారణ జరిపింది. జగన్ దోపిడీ నిజమేనంటూ.. ఈడీ డైరక్టర్ కర్నల్ సింగ్ 2017 మే 31న సీబీఐ డైరెక్టరు ఆలోక్‌వర్మకు రాసిన లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ లేఖను వెలుగులోకి తెచ్చిన తెలుగుదేశం పార్టీ.. కేంద్రంతోజగన్ కుమ్మక్కు కావడం వల్లే రెండేళ్లుగా ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తోంది.

నీకిది - నాకది

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అత్యంత విలువైన 100 ఎకరాల భూ వినియోగ మార్పిడికి అనుమతివ్వడం ద్వారా అప్పటి వైఎస్‌ ప్రభుత్వం హిందూజా గ్రూప్‌నకు చెందిన గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు (జీవోసీఎల్‌) అనుచిత లబ్ధి చేకూర్చిందని ఎన్​ఫోర్స్​మెంట్ డెరెక్టరేట్ పేర్కొంది. దీనికి ప్రతిగా ‘నాకది- నీకిది (క్విడ్‌ ప్రో కో) విధానంలో వైఎస్‌ కుమారుడు జగన్‌ 11.10 ఎకరాల భూమిని హిందూజా గ్రూప్‌ నుంచి పొందారని ఈడీ చెబుతోంది. ఈ కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సమర్పించిన మెమోలో కొన్ని వాస్తవ విరుద్ధ అంశాలున్నాయని తెలిపింది. వాటిని సవరించి మళ్లీ మెమో దాఖలు చేయాలని రెండేళ్ల కిందటే స్పష్టం చేసింది.

మోదీతో జగన్ కుమ్మక్కు

సీబీఐ దాఖలు చేసిన 5 ఛార్జిషీట్లలో పేరు నమోదైన జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ క్విడ్‌ ప్రో కో విధానంలో ఎలాంటి లబ్ధి పొందలేదని కోర్టుకు సమర్పించిన మెమోలో సీబీఐ పేర్కొనడాన్ని కర్నల్​సింగ్ తప్పుబట్టారు. ఈ కేసుల్లో మరింత లోతైన దర్యాప్తు జరపాలని, సీబీఐ కోర్టుకు సవరించిన మెమో సమర్పించాలని సూచించారు. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ మంగళవారం బయటపెట్టింది. ఈడీ డైరెక్టరు రెండేళ్ల క్రితమే లేఖ రాసినా... సీబీఐ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్‌ కుమ్మక్కవడమే కారణమని తెదేపా ఆరోపించింది. అక్రమాస్తుల కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జగన్‌ను మోదీ రక్షిస్తున్నారని ధ్వజమెత్తింది.

క్విడ్ ప్రో కో ఇలా జరిగింది

*హిందూజా సంస్థకు అనుచిత లబ్ధి వ్యవహారంలో క్విడ్‌ ప్రో కో ఎలా జరిగిందో ఈడీ డైరెక్టరు పూసగుచ్చినట్లు వివరించారు. హిందూజా గ్రూప్‌నకు చెందిన జీవోసీఎల్‌కు కూకట్‌పల్లిలో డిటొనేటర్‌ తయారీ పరిశ్రమ ఉంది.

* ఆ పరిశ్రమకు చెందిన 100 ఎకరాల్లో టెక్నాలజీ పార్కును అభివృద్ధి చేస్తామని, భూవినియోగ మార్పిడికి అనుమతివ్వాలని 2005 మార్చి 8న అప్పటి వైఎస్‌ ప్రభుత్వాన్ని జీవోసీఎల్‌ కోరింది. అప్పటి నుంచి ప్రభుత్వానికీ, ఆ సంస్థకూ మధ్య పలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి.

*భూ వినియోగ మార్పిడికి అనుమతివ్వాలంటే జగన్‌కు చెందిన బినామీ సంస్థ యాగా అసోసియేట్స్‌కు 11.10 ఎకరాలు లంచంగా ఇవ్వాలన్న ఒప్పందం జరిగింది.

ఇందులో ఇందూ గ్రూప్‌ అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఒప్పందం ప్రకారం యాగా అసోసియేట్స్‌కు 11.10 ఎకరాల్ని ఎకరం రూ.4.18 కోట్ల చొప్పున రూ.46.40 కోట్లకు విక్రయించినట్లు రికార్డుల్లో చూపించింది. కానీ ఆ భూమి కోసం యాగా అసోసియేట్స్‌ ఒక్కపైసా చెల్లించలేదు. ఆ డబ్బును హిందూజా సంస్థే ఒక చేత్తో యాగా అసోసియేట్స్‌కు ఇచ్చి మరో చేత్తో తీసుకుంది. ఆ 11.10 ఎకరాల ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.177.60 కోట్లు ఉంటుందని ఈడీ డైరెక్టరు తన లేఖలో ప్రస్తావించారు. యాగా అసోసియేట్స్‌ ఏర్పాటు వెనుక సూత్రధారి వైకాపా నేత విజయసాయిరెడ్డి అని ఈడీ డైరెక్టరు లేఖను బట్టి అర్థమవుతోంది.

ఛార్జిషీటులో ఉన్న పేర్లు... మెమోలో ఎందుకు లేవు

జగన్‌ అక్రమాస్తుల కేసులపై దర్యాప్తు చేసిన సీబీఐ 11 ఛార్జిషీట్లు నమోదు చేసిందనీ... ఎఫ్‌ఐఆర్‌లో 73 సంస్థలు/వ్యక్తుల పేర్లుండగా ఛార్జిషీట్లలో 28 సంస్థలు/ వ్యక్తుల పేర్లనే ప్రస్తావించిందని ఈడీ డైరెక్టరు పేర్కొన్నారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సండూర్‌ పవర్‌, కార్మెల్‌ ఏసియా, పీవీపీ బిజినెస్‌ వెంచర్స్‌, జూబిలీ మీడియా కమ్యూనికేషన్స్‌, క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌, ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సరస్వతి పవర్‌, మంత్రి డెవలపర్స్‌ సంస్థలు క్విడ్‌ ప్రో కోకి పాల్పడినట్లు ఆధారాల్లేవని కోర్టుకు సమర్పించిన మెమోలో సీబీఐ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఇవీ చదవండి..

వైకాపాలోకి తోట, పీవీపీ, రాజారవీంద్ర'

లబ్ధిదారులే ప్రచారకర్తలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details