దేశ రాజధాని దిల్లీలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన ముగిసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా ద్వారానే అధిగమించగలమని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వైపు వెళ్తున్నట్టే.. ఏపీ వైపు రావాలంటే ప్రత్యేక హోదా ఉండాల్సిందే అన్నారు. 2014 - 2015 లో రెవిన్యూ లోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి ఇంకా 18 వేల 969 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సి ఉందని చెప్పారు. ఆ మొత్తాన్ని తక్షణమే విడుదల చేసేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
'మాకూ అలాగే అలాగే ఇవ్వండి'
రాష్ట్ర పునర్ విభజన చట్టంలో ఉన్న స్టీల్ ప్లాంట్ హామీని.. అమిత్ షాతో సీఎం ప్రస్తావించారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణంతో పాటు విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించే ప్రాతిపదికను మార్చాలన్నారు. బుందేల్‌ఖండ్, కలహండి ప్రాంతాల ప్రజలకు కేంద్రం నుంచి తలసరి 4000 అందుతోందన్న జగన్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం 400రూపాయలే అందుతోందని వివరించారు. రాష్ట్రంలోనూ బుందేల్‌ఖండ్, కలహండి తరహా విధానం అమలు చేయాలని కోరారు.వెనుకబడిన 7 జిల్లాలకు రూ.2100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పటివరకూ 1050 కోట్లు మాత్రమే అందాయని... మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.