Jagan Comments on Electricity Procurement: ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే గత ప్రభుత్వంపై చేసిన పలు రకాల ఆరోపణలు చేశారు. పీక్ అవర్స్‌లో యూనిట్ విద్యుత్‌ను ఆరు రూపాయలకు కొంటేనే జగన్ అంతలా గుండెలు బాదుకున్నారు. కానీ అదే జగన్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం కన్నా రెట్టింపు ధరకు పీక్ అవర్స్‌లో కరెంటు కొన్నారు. మరి అప్పట్లో జరిగింది దోపిడీ అయితే ఇప్పుడు జరుగుతోందేంటి? నిలువుదోపిడీనా? లేకపోతే లూటీనా..?
Electricity Prices Purchased by YCP Government During Peak Hours:జగన్ అధికారంలోకి వచ్చాక పీక్ అవర్స్‌లో కొనుగోలు చేసిన కరెంటు ధరలు పరిశీలిస్తే ఆయనలోని అపరిచితుడికి షాక్ కొట్టాల్సిందే.! 2022 మార్చిలో పీక్ అవర్స్ పేరుతో కొనుగోలు చేసిన విద్యుత్ సరాసరి యూనిట్ ధర 8 రూపాయల 12 పైసలు. అదే ఏడాది ఏప్రిల్‌లో 9 రూపాయల 64 పైసలకు కొన్నారు. ఇక 2022 మే నెలలోనైతే యూనిట్ విద్యుత్‌ను అత్యధికంగా 11 రూపాయల 24 పైసలుపెట్టి కొన్నారు. ఇక 2023 జనవరిలో సగటున 7 రూపాయల 53 పైసలు, ఫిబ్రవరిలో 8 రూపాయల 64 పైసలు, మార్చిలో 7రూపాయల 93పైసలు, ఏప్రిల్‌లో 8రూపాయల 74పైసలు, మేలో 7రూపాయల 2పైసల చొప్పున పీక్ అవర్స్‌లో యూనిట్ విద్యుత్ కొన్నారు.
జగన్ థియరీ ప్రకారం 6 రూపాయలకే అప్పటి పాలకులు అంత దోపిడీచేస్తే ఆయన ఏలుబడిలో గరిష్టంగా 11 రూపాయల లెక్క ప్రకారం ఎంత ప్రజాధనాన్ని లూటీ చేసుండాలి. విద్యుత్ కొనుగోళ్లలో ఎన్ని వందల కోట్ల దోపిడీకి జగన్ ప్రభుత్వం గత రెండేళ్లలో పాల్పడి ఉండాలి? దీనిపై ఆయన స్పందించరు. ఎందుకంటే తాను చేస్తే ఖర్చు ఇంకొకరు చేస్తే దోపిడీ అన్నట్లు అధికారంలోకొచ్చిన క్షణం నుంచే జనం చెవిలో పూలు పెట్టడం జగన్‌కే చెల్లింది.
Power Purchases in Open Market:ఉదయం, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య పీక్ అవర్స్‌గా విద్యుత్ సంస్థలు భావిస్తాయి. ఈ సమయంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ దెబ్బతినకుండా గరిష్ఠ ధరకు విద్యుత్‌ను మార్కెట్‌లో కొంటున్నాయి. కరెంటు కొనుగోలు కోసం అదనంగా చేసిన ఖర్చును విద్యుత్ సంస్థలు ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేర్లతో, బిల్లుల్లో కలిపి ప్రజల నుంచే ప్రభుత్వం వసూలు చేస్తుంది. టారిఫ్ ఛార్జీలకు అదనంగా 35 శాతం భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారు.
దానికి సాక్ష్యమే జగన్ అధికారంలోకి వచ్చాక షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు. ఈ ఛార్జీలు భరించడమే భారంగా మారితే.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చేసే ఖర్చునూ ప్రజలపై వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం 19 వేల 888 కోట్లు ఖర్చు చేస్తోంది. వాటివల్ల ప్రజలకు అదనంగా వచ్చే ప్రయోజనం లేకపోగా వేల కోట్ల భారం పడుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం అప్పు తెచ్చి మరీ మీటర్లు ఏర్పాటు చేస్తోంది.