Jada Sravan Kumar Fires on YSRCP: చరిత్ర చూడని వ్యక్తి సీఎం అయితే.. వ్యవస్థలు ఎలా నాశనం అయిపోతాయో ఈ పాలన చూస్తే అర్థం అవుతుందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా 2018లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సాయం చేసే కార్యక్రమం మొదలుపెట్టారన్న ఆయన.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని మార్చి వైఎస్సార్ పెళ్లి కానుక అని పేరు మార్చారన్నారు. 2 ఏప్రిల్ 2020 నుంచి పెంచిన సాయం అమలులోకి వస్తుందని చెప్పారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి సాయం చేశారో చూస్తే ఆ సంఖ్య సున్నా అని విమర్శించారు.
రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల మందికి అన్యాయం జరుగుతుంటే.. గత మంత్రి విశ్వరూప్, ప్రస్తుత మంత్రులు మేరుగ నాగార్జున, విడుదల రజనీలు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ పిల్లలకు వారు ఏమి న్యాయం చేస్తున్నారని జడ శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. పెళ్లి కానుక కింద డబ్బులు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామని జడ శ్రవణ్ హామీ ఇచ్చారు. దశ యాప్ ద్వారా తమను సంప్రదించాలని.. జీవో ఇచ్చి పథకాలు అందించకపోతే వారి కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మంత్రికి దమ్ము ఉంటే వైఎస్సార్ పెళ్లి కానుక ఎందరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేేశారు.