ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులకు వేసిన సంకెళ్లే... జగన్ ప్రభుత్వానికి ఉరితాళ్లు' - గుంటూరు జిల్లా జైలు వద్ద ఐకాస ఆధ్వర్యంలో నిరసన

రైతులకు వేసిన సంకెళ్లే... జగన్ ప్రభుత్వానికి ఉరితాళ్లుగా మారుతాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని ఖండిస్తూ... గుంటూరు జిల్లా జైలు వద్ద ఐకాస ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

jac protest at guntur jail
రైతులకు వేసిన సంకెళ్లే... జగన్ ప్రభుత్వానికి ఉరి తాళ్లు

By

Published : Oct 28, 2020, 6:02 PM IST

Updated : Oct 28, 2020, 6:34 PM IST

రైతులకు వేసిన సంకెళ్లే... జగన్ ప్రభుత్వానికి ఉరి తాళ్లు

అధికార వైకాపా అహంకారం పరాకాష్టకు చేరుతోందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. అమరావతి రైతులకు బేడీలు వేసిన ఘటనకు నిరసనగా గుంటూరు జిల్లా జైలు వద్ద ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. దళితుల రక్షణ కోసం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని దళితులపైనే ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. కేసు పెట్టిన వ్యక్తి ఫిర్యాదు వెనక్కు తీసుకున్నా.. పోలీసులు రైతులను అరెస్టు చేయటం దారుణమన్నారు. తనకు ఓట్లు వేసిన దళితులపై జగన్ పగ తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఇది దేశంలోనే మొదటిసారి..

అమరావతి ఉద్యమం పట్ల ప్రభుత్వ అణచివేత పరాకాష్టకు చేరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపైనే ఎస్సీ వేధింపుల చట్టం కింద కేసులు పెట్టడం దేశంలోనే మొదటిసారన్నారు. నేరస్తుల మాదిరిగా రైతులకు బేడీలు వేయటంతోనే ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని దుయ్యబట్టారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సీఎం వర్గానికి సంకెళ్లు వేయగలరా..

ఇన్నాళ్లూ... అమరావతి ఉద్యమం ఒక కులానికి సంబంధించిందని ప్రచారం చేసిన ప్రభుత్వం... ఇపుడు ఎస్సీలు, బీసీలను ఎందుకు అరెస్ట్ చేసిందో చెప్పాలని గుంటూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతి రైతుల మాదిరిగా జగన్ సామాజికవర్గానికి చెందినవారికి సంకెళ్లు వేసి తీసుకెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా వైయస్ కుమారుడి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

పోలీసులు సమాధానం చెప్పాలి..

భూములిచ్చిన రైతులు కడుపు మండి పోరాటం చేస్తుంటే... వారికి పోటీగా అధికార పార్టీ నేతలు పోటీ ఆందోళనలు చేయటాన్ని తప్పుబట్టారు. రైతుల అరెస్టుపై రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్​తో పాటు మంగళగిరి డీఎస్సీ దుర్గాప్రసాద్ సమాధానం చెప్పాలన్నారు. చట్ట ప్రకారం వెళ్లకుండా పోస్టింగులు, ప్రమోషన్ల కోసం పని చేస్తారా అని పోలీసులను ప్రశ్నించారు. రైతులకు వేసిన సంకెళ్లే ప్రభుత్వానికి ఉరితాళ్లుగా మారనున్నాయని హెచ్చరించారు.

వ్యవస్థలపై జగన్​కు నమ్మకం లేదు..
ముఖ్యమంత్రి జగన్​కు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. ఈ వ్యవహారంలో క్రిందిస్థాయి పోలీసులపై చర్యలు తీసుకుని ప్రభుత్వం సరిపెడుతోందని ఆరోపించారు.

ఇదీ చూడండి:

'అన్నం పెట్టే రైతు చేతులకు సంకెళ్లు వేస్తారా?'

Last Updated : Oct 28, 2020, 6:34 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details