Telangana Digital Repository : తెలంగాణ ఎన్నో ప్రత్యేకతల ఖజానా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాలు, వింతలు, విశేషాలు వర్తమాన అంశాల సమ్మిళితం. వీటన్నింటి సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరిచి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉంది. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య, పురావస్తు, వారసత్వ సంపదకు సంబంధించిన సమాచారం వేర్వేరు వ్యక్తులు, సంస్థల నియంత్రణలో ఉండటంతో సమాచార సేకరణ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
ప్రత్యేకంగా రుసుములు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజలకు ఉచితంగా ఈ సమాచారం అందించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ఓ మహత్తర క్రతువును త్వరలోనే చేపట్టబోతోంది. సమాచారాన్ని డిజిటల్ రూపంలో తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ పేరిట భద్రపరచనుంది. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. డిజిటల్ మీడియా విభాగానికి దిలీప్ కొణతం సంచాలకుడిగా వ్యవహరిస్తుండగా.. ప్రాజెక్టు సమన్వయకర్తగా నరేందర్‌రెడ్డి ఉన్నారు.
పొందుపరిచే వివరాలు:తాళపత్రాలు, పుస్తకాలు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, డాక్యుమెంట్లు ఇలా ఏ రూపంలో ఉన్నా రిపాజిటరీలో పొందుపరచనున్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న సమాచారం సేకరించే పనులు చేపట్టారు. పురాతన ప్రతులు, విశేషాలు, ఫొటోలు, వీడియోల వంటి సమాచారం ఉంటే తెలియజేయాలని మీడియా విభాగం సూచిస్తోంది. డిజిటల్ రిపాజిటరీలోని సమాచారాన్ని ఇంటర్నెట్ సాయంతో ప్రజలు పొందే వీలుంటుంది. నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.