ISRO NEW SUCCESS : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలోనే ఇదొక నూతన అధ్యాయం. శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా చిన్న ఉపగ్రహ వాహకనౌకను తయారు చేసి, ప్రయోగించి విజయం సాధించారు. దీనివల్ల సమయంతోపాటు, ఖర్చు ఆదా అయింది. అంతేకాకుండా వాణిజ్యపరంగా మరింత ముందుకెళ్లేందుకు ఇది ఉపయోగపడనుంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు గల ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికా అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ క్విడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీ శాట్-2లను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం కావటంతో ఇస్రో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అతి తక్కువ ఖర్చు, ఐదు రోజుల వ్యవధిలో రాకెట్‌ను రూపొందించి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను.. విజయవంతంగా పంపిన దేశాల ఖాతాలో భారత్ తన పేరును నమోదు చేసుకుంది.
ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఎందుకు చేశారంటే : చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ద్వారా తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పీఎస్‌ఎల్‌వీ తయరు చేయడానికి 45 రోజులకు పైగా సమయం పడుతుంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీని వారం రోజుల్లోపే తయారు చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఉపగ్రహాలను పంపడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రయోగించిన వాహకనౌక 34 మీటర్లపొడవు. 2 మీటర్ల వ్యాసం, 120 టన్నుల బరువు కలిగి ఉంది.
మొదటి ప్రయత్న విఫలమే ఇప్పటి విజయం : ప్రయోగం విజయవంతమైన తర్వాత ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 వాహకనౌక ద్వారా ఈవోఎస్-07 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో చాలా కచ్చితంగా ప్రవేశపెట్టామని తెలిపారు. మరో రెండు ఉప్రగహాలు జానుస్-1, ఆజాదీశాట్-2 కూడా అనుకున్న కక్ష్యలో ఉంచామన్నారు. గత ఏడాది ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 వేగం లోపించిన కారణంగా ఉపగ్రహాన్ని కక్ష్యలో ఉంచడంలో స్వల్పంగా విఫలమైందని వివరించారు. అందులో ఎదుర్కొన్న సమస్యలను అన్ని కోణాల్లో విశ్లేషించి దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2లో అమలు చేశామన్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ మిషన్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ ఇది మొదటి ప్రయత్నంలో విఫలమైందని, ఆ క్రమంలో నేర్చుకున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని డీ2 ప్రయోగాన్ని విజయవంతం చేశామని చెప్పుకొచ్చారు.