ప్రకాశం బ్యారేజి నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని కాలువలకు సాగునీటి విడుదలకు సంబంధించి కార్యాచరణ సిద్ధమైంది. పశ్చిమ డెల్టా పరిధిలో దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం జులై 1వ తేదిన సాగునీరు విడుదల చేయాలని నిర్ణయించారు. గత ఏడాది కూడా అదే తేదీన విడుదల చేశారు. ఈసారి కూడా వర్షాలు జూన్ లో పడతాయని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి.
ఆ మేరకు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజికి నీటిని తరలించనున్నారు. ఈ లోగా డెల్టా పరిధిలోని సాగునీటి కాలువలు, డ్రెయిన్లను మరమ్మత్తులు చేయనున్నారు. వీటి కోసం 17 కోట్ల రూపాయలతో నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. దీంతో రైతుల నుంచి వసూలు చేసిన నీటి పన్ను 5.65 కోట్ల రూపాయలతో మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు.
సాగునీటి కాలువల మరమ్మత్తులను నీటిపారుదశాఖ చేపట్టనుంది. దీనికోసం టెండర్లు పిలవనున్నారు. ఇక డ్రెయిన్ల మరమ్మత్తులను ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 200 పనులను గుర్తించారు. డ్వామా ద్వారా ఆ పనులు నిర్వహించనున్నారు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కాలువలు, డ్రెయిన్లు మరమ్మత్తులు తప్పనిసరి.