DRAINS ARE DIRE POSITION AT GUNTUR: ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు కింద గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5.70 లక్షల ఎకరాల సాగుభూములున్నాయి. వీటికి సాగునీరు అందించే కాలువలు, పొలాల నుంచి మురుగునీరు వెళ్లే డ్రెయిన్లు కనీస నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. 2, 3 అడుగుల మేర పెరిగిపోయిన పూడిక, పిచ్చిమొక్కలు పెరిగి కాలువలు కనిపించకుండా పోయిన పరిస్థితి. దీంతో భారీ వర్షాలు వచ్చినా, కృష్ణానదికి వరద పోటెత్తినా నీరు పొలాలపైకి ప్రవహిస్తోంది.
ముఖ్యంగా వరి పంట ఆఖరు దశలో తుపాన్లు వస్తే డెల్టా భూముల్లో నీరు సకాలంలో వెళ్లకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మురుగు కాలువల్లో పిచ్చిమొక్కలు, పూడిక తొలగించి నీటిప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగించాలి. కానీ నాలుగేళ్ల నుంచి సాగు, మురుగునీటి కాలువల్లో ఎలాంటి పనులు గానీ, మరమ్మత్తులు కానీ చేయలేదు.
కృష్ణా పశ్చిమ డెల్టాలో కీలకమైన కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ వివిధ కారణాలతో ఆగిపోయింది. 410 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో 30 కోట్ల పనులు కూడా పూర్తికాకుండానే సాంకేతిక కారణాలతో ఆపేశారు. అప్పటి నుంచి కొమ్మమూరు కాలువ నిర్వహణ చేపట్టకపోవడం వల్ల కాలువ కట్టలు బలహీనంగా తయారయ్యాయి. గుంటూరు వాహినిలోనూ తూటుకాడ, పిచ్చిమొక్కలు పెరిగి నీటిప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.
" పాలకుల నిర్లక్ష్యంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కాలువ మరమ్మతులు జరగలేదు. వర్షాకాలంలో భారీ వరదల కారణంగా పైనుంచి వచ్చే నీళ్ల వల్ల కాలువలు కోతకు గురవుతున్నాయి. కాలువకట్టలు మాత్రం చాలా బలహీనంగా ఉన్నాయి. గత సంవత్సం పంటలు అన్ని మునిగిపోయాయి. ఈ కాల్వ ద్వారా కొన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు మరమ్మతులు చేపించాలని కోరుకుంటున్నాం"-వెంకటనరసింహారావు, చింతలపూడి గ్రామస్థుడు