procurement of vidyakanuka kits: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు... బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్ క్లాత్ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్‌లు, ఆంగ్ల నిఘంటువును జగనన్న విద్యా కానుక కింద అందిస్తున్నారు. వీటికి సంబంధించి బ్యాగ్‌లు, బూట్ల నాణ్యత సరిగా లేదని... విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ తనిఖీల్లో ఇప్పటికే బయటపడగా.... కొత్తగా కొనుగోళ్లలోనూ లోపాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏటా ఎక్కువ మొత్తం కొని వాటిని మూలనపడేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటూ... 5శాతం అధికంగా కిట్లు కొనుగోలు చేస్తుండగా.. మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఫలితంగా కిట్లు భారీగా మిగిలిపోతున్నాయి. వాటిని.. వచ్చే ఏడాది పిల్లలకు ఇవ్వాలా? లేదంటే గుత్తేదారుకు వెనక్కి ఇచ్చేయాలా..?అనే విషయాన్నే పట్టించుకోవడం లేదు. గుత్తేదార్లు సరఫరా చేసినట్లు... ధ్రువపత్రాలు ఇవ్వగానే బిల్లులు చెల్లిస్తున్నారే గానీ.. మిగిలిపోయిన వాటి గురించి ఆలోచించడం లేదు.
సమగ్ర శిక్ష అభియాన్‌లో విద్యాకానుక టెండర్లు, సరఫరా అంటేనే కాసులు కురిపించే విభాగంగా మారిపోయింది. గతేడాది కొన్న కిట్లు జిల్లాల్లో ఏడు లక్షలకు పైగా ఉండగా... ఇప్పుడు మళ్లీ మూడు లక్షలు ఎక్కువ కొనడానికి టెండర్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే అంచనాతో కొనేస్తున్నారు. గత రెండేళ్లల్లో... ఇలా ఎనిమిదిన్నర లక్ష కిట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది... మరో మూడు లక్షలు పెంచి కొనడానికి టెండర్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బూట్లు, బెల్టుల టెండర్లు పూర్తికాగా... యూనిఫామ్, బ్యాగ్‌ల టెండర్లు ప్రాసెస్‌లో ఉన్నాయి. గతేడాది ఒక్కో కిట్‌కు... రూ. 1,726 వ్యయం చేయగా ఈ ఏడాది కిట్‌కు రూ. 1,960 ఖర్చు చేశారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన కిట్ల విలువ 162 కోట్ల రూపాయలకుపైనేఉంటుంది. ఈ ఏడాది 47.40 లక్షల కిట్లు కొనుగోలు చేయగా.. ప్రభుత్వ బడుల్లో అనూహ్యంగా 3.98 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. జిల్లాల్లో మిగిలిపోయిన వాటిని రాష్ట్ర స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదు. గుత్తేదార్లకు బిల్లులుచెల్లించడం తదుపరి ఏడాది కొనుగోలుకు టెండర్లు పిలవడంపైనే దృష్టిపెడుతున్నారు.