Irregularities in Jagananna Vidya Kanuka :వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పింది. ఏ పథకం ప్రవేశపెట్టినా వాటి నుంచి అధికార పార్టీ అస్మదీయులకు గరిష్ఠ మేలు జరిగేలా పన్నాగాలు పన్నుతున్నారు. విద్యాకానుక కిట్ల విషయంలోనూ ఇదే తేలింది. విద్యాకానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, ఒక స్కూల్ బ్యాగు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్కులు, ఆంగ్ల నింఘటువు కలిపి ఇచ్చారు. ఈ కిట్లకొనుగోళ్ల విషయంలో 2022-23 సంవత్సరం నివేదికలో ఆడిట్ విభాగం అనేక ఉల్లంఘనలు గుర్తించింది.
Jagananna Vidya Kanuka 2023-2024 : 2021 అక్టోబరులో ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల 60 వేల మంది విద్యార్థులు ఉండేవారు. అ సంఖ్యకు 5 శాతం అధికంగా 2022-23 సంవత్సరానికి 47లక్షల 88 వేల కిట్లు కొనేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఇందులో భాగంగా 45 లక్షల 14 వేల కిట్లకు టెండర్లు పిలిచారు. ఒక్కో కిట్టు 15 వందల 65 రూపాయల చొప్పున 960 కోట్లు వ‌్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ 2022 సెప్టెంబరుకు విద్యార్థుల సంఖ్య 40 లక్షల 66 వేలకు పడిపోయింది. ఫలితంగా 4 లక్షలకుపైగా కిట్లు మిగిలిపోయాయి. దాని విలువ 70 కోట్ల 13 లక్షలు. ఆ మేర ప్రజాధనం వృథా అయిందనిఆడిట్విభాగం తప్పుపట్టినా, అనేక ప్రశ్నలు సంధించినా అధికారుల నుంచి సమాధానంలేదు.
Illegal in Jagananna Vidya Kanuka Kits Purchases :2023-24 విద్యా సంవత్సరానికి కొత్తగా టెండర్లు పిలిచేటప్పుడు అంతకుముందు ఏడాదిలో 4 లక్షల కిట్లు మిగిలాయనే విషయాన్నే పట్టించుకోలేదు. వాటిని ఏం చేద్దామనే ఆలోచనే చేయలేదు. ఈసారీ విద్యార్థుల వాస్తవ సంఖ్యను పరిగణనలోకి తీసుకోలేదు. మళ్లీ అంచనాలను పెంచి 43 లక్షల 10 వేల కిట్లకు టెండర్లు పిలిచారు. అలా ఎందుకు చేశారనే ప్రశ్నకుపాఠశాల విద్యాశాఖ నుంచి సమాధానం లేదు. ఆ తర్వాత పిల్లలు తగ్గినందున 39 లక్షల 96 వేల కిట్లే తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అసలు ఎన్ని లక్షల కిట్లను కొన్నారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి.