గుంటూరు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అక్రమాల పుట్టలు పగులుతున్నాయి. నకిలీ పత్రాలతో కోట్లు కొల్లగొట్టిన ఉదంతాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ ఆధార్, పాన్‌కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాల తయారీ వెనుక రాజకీయ నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. వేర్వేరు సర్వేనంబర్ల కింద నాలుగు నకిలీ పేర్లతో వివిధ సొసైటీల్లో అక్రమంగా రుణాలు పొందినట్లు అధికారులు గుర్తించారు.
గుంటూరు జిల్లాలోని మొత్తం 13 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రూ. 9.74 కోట్ల మేర పక్కదారిపట్టినట్లు.. అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఐనవోలు, వెలగపూడి గ్రామంలో నివసిస్తూ.. మాచవరం మండలంలో భూములున్నట్లు చూపించి తాడికొండ మండలం నెక్కల్లు సొసైటీ నుంచి నలుగురు వ్యక్తులు రుణాలు పొందారు. నెక్కల్లు చిరునామాతోనే మరో ముగ్గురు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫైలు సిద్ధమైన తర్వాత కార్యదర్శికి అనుమానం వచ్చి ఆరా తీయగా.. అక్రమ వ్యవహారం బయటపడింది.