Warangal International Convention Center :తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) తరహాలో వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశ కేంద్రం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.175 కోట్ల తో ‘వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’ పేరిట దీనిని మడికొండ ఐటీ పార్కులో పది ఎకరాల్లో నిర్మించనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో దీనిని చేపట్టేందుకు రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) తాజాగా టెండర్లు పిలిచింది.
International Convention Center in Warangal : తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఐటీ పార్కును ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇందులో తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో దేశంలో అతిపెద్దదైన కాకతీయ మెగా జౌళి పార్కును రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్ల క్రితం ప్రారంభించింది. దీనికి పలు ప్రసిద్ధ సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
ఈ సందర్భంగా సంప్రదింపుల్లో వరంగల్‌లో అంతర్జాతీయ సమావేశం మందిరం కావాలనే అంశంపై చర్చ జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ వరంగల్‌లో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.వివిధ స్థలాలను పరిశీలించిన టీఎస్‌ఐఐసీ మడికొండ ఐటీ పార్కులోనే దాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. టెండర్ ఖరారయ్యాక పనులు చేపడతారు.
3 స్టార్ హోటల్ సైతం.. సమావేశ మందిరాన్ని 50వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. దానికి అనుబంధంగా మరో 30 వేల చదరపు అడుగుల్లో ప్రదర్శనశాల, సమావేశ మందిరాలు, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటవుతాయి. 3 స్టార్ హోటల్, వినోద కేంద్రం, బాల్‌రూమ్, సర్వీస్ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు. వీటన్నింటి కోసం టీఎస్ఐఐసీ తాజాగా టెండర్లు కూడా పిలిచినట్లు సమాచారం.