Stampede Inquiry Committee : గుంటూరు వికాస్ గ్రౌండ్స్‌లో సంక్రాంతి కానుకల పంపిణీలో జరిగిన తొక్కిసలాటపై.. విచారణ కమిటీ ఘటనాస్థలాన్ని పరిశీలించింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నియమితమైన ఈ కమిటీ.. ఘటన జరిగిన తీరుపై విచారణ చేపట్టింది. రిటైర్డ్ జడ్డి జస్టిస్ శేష సాయిరెడ్డితోపాటు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరీఫ్, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన సంక్రాంతి కానుక పేరుతో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
సభావేదిక, ఘటన జరిగిన ప్రదేశం, ఆసమయంలో అక్కడి పరిస్థితులపై తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జి శేషశయనారెడ్డి ఆరా తీశారు. ఘటన సమయంలో అక్కడున్న కొందరు బాధితులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిని పిలిచి విచారణ జరిపారు. సభను ఎంత మంది సామర్థ్యంతో నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వారి వద్ద నుంచి కూడా సేకరించారు. ఘటన జరిగిన సమయం, బాధిత కుటుంబాలకు తెలిసిన సమయం వంటి ఆంశాలను తెలుసుకున్నారు.
ఇదీ జరిగింది :ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ మైదానంలో జనవరి 1వ తేదిన పేదలకు సంక్రాంతి కానుకలు, దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమానికి హాజరై కొందరికి కానుకలు అందించారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిన తరువాత నిర్వాహకులు పంపిణీ ప్రారంభించారు. కానుకల కోసం ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది.