Innovative Restaurant in Guntur : రోజురోజుకీ ప్రజల ఆలోచనలు, అభిరుచులు మారుతున్నాయి. కొత్త రుచులు, విభిన్న వాతావరణం కోరుకుంటున్నారు. ఆ మేరకు రెస్టారెంట్ల ఏర్పాట్లులోనూ కొత్త పోకడలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు సైతం విభిన్నంగా ఆలోచించారు. పర్ణశాల పేరుతో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గ్రామీణ వాతావరణానికి కొత్త సొబగులు అద్దినట్లు ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇలా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ పేరు పర్ణశాల. పురాణాల్లో శ్రీరాముడు వనవాస సమయంలో పర్ణశాల ఏర్పాటు చేసుకుని అందులో నివసించినట్లు చదువుకున్నాం. అదే ఆలోచనతో రెస్టారెంట్ నిర్వాహకులు ఈ పేరు పెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. రెస్టారెంట్ నిర్మాణ సమయంలో ఇనుము, ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకుండా సహజసిద్ధమైన వాటిని ఉపయోగించారు.
తాటిచెట్లను స్థంభాలుగా మార్చారు. చెక్క, వెదురు బొంగులతో గోడలు ఏర్పాటు చేశారు. రెల్లు గడ్డిని పైకప్పు కోసం ఉపయోగించారు. కేన్ ఫర్నీచర్, నులక మంచాలు ఇలా ఇంటీరియర్ కూడా ప్రత్యేకంగా ఎంపిక చేశారు. గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టే అందమైన వర్ణచిత్రాలను గోడలపై ఉంచారు. అంతా పల్లెటూరి వాతావరణం, అడవిలో ఉండే కుటీరం తరహాలో రెస్టారెంట్ నిర్మించారు. సహజసిద్ధమైన వాటితో ఏర్పాటు చేసినందున వేసవిలో కూడా చల్లగా ఉంటుందని.. అందుకే రెస్టారెంట్లో ఏసీలు కూడా ఏర్పాటు చేయలేదని వివరించారు.