జగనన్న చేదోడులో అక్రమాల పర్వం గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలో 30 మంది దర్జీలకు జగనన్న చేదోడు పథకం కింది రూ.3 లక్షలు మంజూరు చేశారు. మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి, వాలంటీరు కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి అనర్హులతో దరఖాస్తు చేయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాత కుట్టు మిషన్లు కొనుగోలు చేయించడం సహా బయట నుంచి కొన్ని మిషన్లు తెప్పించి దర్జీ వృత్తిలో ఉన్నట్లుగా అధికారులకు చూపించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ప్రభుత్వ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దర్జీ వృత్తిలో లేని వారికీ సాయం మంజూరయ్యేలా చేసినట్లు స్పష్టం చేస్తున్నారు.
పరిశీలన చేయకుండానే..
లబ్ధిదారులు దర్జీ వృత్తిలో ఉన్నట్లుగా కార్మికశాఖ అధికారితో ధ్రువపత్రాలు జారీ చేయించినట్లు చెబుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే అనర్హులకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము డ్రా చేసి స్వాహా చేసేలోపే.... జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమాలకు సహకరించిన వారిపై ఇంకా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. వారు తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు.
ఇదీ చూడండి..
కరోనా ఎఫెక్ట్: కుసుమాలు కొనేవారే కరువయ్యారు