ఓ వైపు గత వైభవానికి అద్దం పట్టేలా కనిపిస్తున్న పాత భవనం. మరోవైపు కొత్తదనానికి సంకేతంగా నిలుస్తున్న నిర్మాణం. ఈ రెండూ ఆ ప్రాంతంలో వేలాది మందికి విద్యను ప్రసాదించిన ఆలయాలు. గుంటూరు జిల్లా కాకుమానులో 75 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది ఈ పాఠశాల. చదువుకోవడానికి పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఊళ్లోనే బడి నిర్మించాలని భావించిన ఆ గ్రామస్థులు అదే సంకల్పంతో ముందుకెళ్లారు. నన్నపనేని నాగయ్య రూ.11 వేల పాటు 1.63 ఎకరాల పొలాన్ని విరాళంగా అందించి తొలి అడుగు వేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి కొందరు తోచినంత సాయం చేశారు. బడి నిర్మాణాన్ని అందరి బాధ్యతగా.. ఇంటికొకరు శ్రమదానంలో పాల్గొన్నారు. ఎద్దుల బండ్లతో మట్టి తోలారు. భవన నిర్మాణానికి కావాల్సిన ఇసుకను కొమ్మునూరు కాల్వ ద్వారా పడవల్లో తెప్పించారు. అలా 1946లో పాఠశాల నిర్మాణం పూర్తై.. విద్యాబోధన మొదలైంది.
విద్యా వాలంటీర్ల నియామకం..
పాఠశాల మొదలైనప్పటి నుంచి కాకుమాను సహా చుట్టుపక్కల గ్రామాల్లోని రెండు, మూడు తరాల పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. కాలక్రమంలో పాఠశాల భవనం పాడైపోయింది. విరిగిన కిటికీలు, పై కప్పు నుంచి కారుతున్న వర్షపు నీరు వల్ల.. చదువులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సమయంలో చదువులమ్మ రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి.. భవనాలకు మరమ్మతులు చేయించారు. బోధనకు అవసరమైన సామగ్రి అందజేశారు. అధ్వానంగా ఉన్న ఆట మైదానానికి మెరక తోలించి.. వాకింక్ ట్రాక్ సహా అదనపు హంగులు చేర్చారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేందుకు.. షెడ్డు, వేడుకలు జరిపేందుకు కళావేదిక నిర్మించారు. పాఠశాలకు కంప్యూటర్లు, విద్యార్థులకు సైకిళ్లు అందించారు. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించారు. వారికి జీతాలనూ పూర్వ విద్యార్థులే సమకూర్చారు.
ఇక్కడ చదివిన చాలా మంది ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు..
మాజీ మంత్రి జేడీ శీలం, బాపట్ల మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరిరావు, పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్‌బాబు వంటి చాలా మంది ప్రముఖులు కాకుమాను పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. ఇక్కడ చదివిన చాలా మంది వివిధ రంగాల్లో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. పాఠశాల ప్రారంభమై నేటితో 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా చాలా మంది పూర్వ విద్యార్థులు.. వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. పాఠశాలను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పాఠశాల భవనాలకు రంగులు వేయించారు. జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సదుపాయాలతో అదనపు తరగతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.