ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విదేశీ జైళ్లలో.. వేల సంఖ్యలో భారతీయులు

Indians in foreign prisons : ఆర్థిక అవసరాలు వాళ్లను విదేశాలకు వెళ్లేలా చేస్తున్నాయి. కన్నవాళ్లను.. కట్టుకున్న వారిని.. పిల్లలను.. పుట్టిన ఊరుని వదిలి తెలియని ప్రదేశాలకు వెళ్లిన వారంతా తెలిసో తెలియకో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారు. అక్కడి సిస్టం గురించి తెలియక.. స్వదేశాల నుంచి సరైన సాయం అందక జైళ్లలోనే ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. 82 దేశాల్లో 8,343 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు.

Indians in foreign prisons
విదేశీ జైళ్లలో భారత ఖైదీలు

By

Published : Feb 11, 2023, 11:56 AM IST

Indians in foreign prisons : ఉపాధి కోసం ఊరొదిలిన అభాగ్యుల్లో చాలా మంది తెలిసో తెలియకో చేసిన తప్పులకు కటకటాల పాలవుతున్నారు. విదేశాల్లో జైళ్లలో మగ్గుతున్న వారి వివరాలు కావాలంటూ కొందరు ఎంపీల వినతి మేరకు పార్లమెంటులో విదేశాంగ శాఖ సహాయమంత్రి సమాధానం ఇచ్చారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 82 దేశాల్లో 8,343 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉండగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బాధితులు కూడా పదుల సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఇవీ ఘటనలు

  • కథలాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి యూఏఈలో అక్రమంగా సరిహద్దు దాటుతూ పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
  • సారంగాపూర్‌ మండలం లచ్చక్కపేటకు చెందిన ఇద్దరు అమాయకులను రాయికల్‌ మండలానికి చెందిన ఓ ఏజెంట్‌ మాయమాటలు చెప్పి హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌ విమానం ఎక్కించాడు. అక్కడి నుంచి మలేషియాకు భూమార్గం ద్వారా కొంత దూరం బస్సులో, కొంతదూరం నడక ద్వారా చేర్చారు. మలేషియాలో ఉపాధి కోసం బస్సు ఎక్కుతున్న అభాగ్యులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
  • మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన రాజయ్య రియాద్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
  • మల్యాలకు చెందిన రాజయ్య జైల్లో శిక్ష అనుభవిస్తూ మృతిచెందగా కనీసం మృతదేహం ఇల్లు చేరలేదు. ఆయన డెత్‌ సర్టిఫికెట్‌ మాత్రమే పంపడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

నిబంధనలు తెలియక..ఉమ్మడి జిల్లా నుంచి 3.50 లక్షల మంది వరకు గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. ఇందులో ఉద్యోగులుగా కొందరు స్థిరపడగా చాలా మంది కార్మికులుగా వివిధ దేశాల్లో పనులు చేస్తున్నారు. కార్మికులుగా స్థిరపడిన వారిలో కొందరికి శిక్షణ నైపుణ్యం ఉండగా ఎక్కువ మంది అన్‌స్కిల్డ్‌గానే పనులు చేసుకుంటున్నారు. ఏజెంట్ల వలలో పడిన వారు గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌, ఖతర్‌, బహ్రెయిన్‌, కువైట్‌ తదితర దేశాల్లో అక్కడి నిబంధనలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇమ్మిగ్రేషన్‌ చట్టాలపై అవగాహన లేకపోవడంతో పాటు వీసా ముగిసినా అక్కడే ఉన్నవారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు.

విదేశాంగ శాఖ సహాయమంత్రి పార్లమెంటులో వెల్లడించిన వివరాల మేరకు 82 దేశాల్లో 8,343 మంది జైలు శిక్ష అనుభవిస్తుండగా ఇందులో సగానికి పైగా 4,755 మంది గల్ఫ్‌ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారు. మన కార్మికులు శిక్ష అనుభవిస్తున్న సమయంలో న్యాయ సహాయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా దేశాలు నేరాన్ని బట్టి జరిమానా విధిస్తున్నా చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో జైలు శిక్ష అనుభవించడానికే పలువురు మొగ్గు చూపుతున్నారు.

వివిధ దేశాల్లో ట్రాఫిక్‌ వయలేషన్‌, రంజాన్‌ పవిత్ర మాసాల్లో కఠిన నిబంధనలు పాటించకపోవడంతో పోలీసులకు చిక్కుతున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెడుతున్న వారిని కూడా అక్కడి ప్రభుత్వాలు అరెస్టు చేస్తున్నాయి. జైలుశిక్ష పడిన వారిలో ఉద్దేశపూర్వకంగా దాడులు, హత్య, ఇతర నేరాలు చేసిన వారి శిక్షలు ఒక రకంగా ఉంటుండగా.. తెలిసీ తెలియక చేసిన వారిని ఇమ్మిగ్రేషన్‌ డిపోటేషన్‌ కేంద్రాలకు తరలించి శిక్ష అమలు చేస్తారు.

చిన్న నేరాల సమయంలో జరిమానా విధిస్తుండగా న్యాయవాదిని సంప్రదించలేక, జరిమానా కట్టలేక జైలు జీవితం గడుపుతున్నారు. ఒమన్‌ మినహాయించి మిగిలిన గల్ఫ్‌ దేశాలు ఖైదీల బదిలీ చట్టంపై భారత్‌తో అంగీకారం కుదుర్చుకున్నాయి. ఈ అంగీకారం ప్రకారం ఇతర దేశాల్లో శిక్ష పడినా స్వదేశంలోని జైళ్లలో శిక్ష అనుభవించే వెసులుబాటు ఉంది. కానీ ఇది అమలుకు నోచుకోకపోవడంతో అక్కడి దేశాల్లోనే శిక్ష అనుభవించాల్సి వస్తోంది.

చట్టాలపై అవగాహన తప్పనిసరి.. 'ఉపాధి కోసం వెళ్తున్న వారు ఆయా దేశాల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అరబ్‌ దేశాల సంస్కృతీ సంప్రదాయాలు, నిబంధనలు కఠినంగా ఉంటాయి. వీటిని ఉల్లంఘించిన వారు జైలు పాలవుతున్నారు. ముఖ్యంగా నకిలీ ఏజంట్ల ద్వారా వివిధ దేశాలకు వెళ్లిన వారు ఇమ్మిగ్రేషన్‌ యాక్టు ప్రకారం శిక్షల పాలవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సహాయం అందిస్తే అభాగ్యులకు ఊరట కలుగుతుంది.' - మంద భీంరెడ్డి, గల్ఫ్‌ కార్మిక సంఘం నాయకుడు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details