Temperatures Rising in the State: వేసవి ప్రారంభంలోనే ముందే ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పొడి వాతావరణం నెలకొనటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పగటి పూట సాధారణ ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల మేర పెరిగాయని భారత వాతావరణ విభాగం తెలియచేస్తోంది. ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లోనే ఉష్ణోగ్రతల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది.
దీంతో ఎండ వేడి , వడగాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త అవసరం. జాగ్రత్త తీసుకోకపోతే.. కిడ్నీ, గుండెపై తీవ్ర ప్రభావితమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా కిడ్నీ జబ్బులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఒడిశాలోని భువనేశ్వర్, కచ్ ప్రాంతంలోని భుజ్, ఆంధ్రప్రదేశ్లోని తునిలో నమోదు అయినట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఈ మూడు చోట్లా 38.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు వెల్లడించింది. సాధారణంతో పోలిస్తే సగటు ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఓడిశా, తమిళనాడు, కేరళ సహా వేర్వేరు రాష్ట్రాల్లో పెరిగినట్టు భారత వాతావరణ విభాగం చెబుతోంది.
మరోవైపు ట్రోపో ఆవరణం నుంచి మహారాష్ట్రలోని మధ్య ప్రాంతాల నుంచి హిమాలయ పర్వత పాదప్రాంతాల వరకూ పశ్చిమ అలజడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు వాయువ్య ప్రాంతం నుంచి కోస్తాంధ్ర వరకూ ఉష్ణగాలుల తీవ్రత కూడా క్రమేపీ పెరిగే అవకాశముందని ఐఎండీ చెబుతోంది. గడచిన 24 గంటల్లో గరిష్టంగా శ్రీకాకుళంలో 35.2 డిగ్రీలు, విజయనగరం 37.1 డిగ్రీలు, విశాఖ 35 డిగ్రీలు, తునిలో 38.5 డిగ్రీలు, విజయవాడ 35.3 డిగ్రీలు, కర్నూలు 36 డిగ్రీలు, ఒంగోలు 35.2 డిగ్రీలు, నెల్లూరు 34.5 డిగ్రీలు, తిరుపతి 35.9 డిగ్రీలు, అనంతపురం 36.2, చిత్తూరు 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.