కొవ్వొత్తులతో అంగన్వాడీల నిరసనలు - డిమాండ్లు పరిష్కరించేవరకు వెనక్కు తగ్గబోమని స్పష్టం Indefinite Strike of Anganwadis is Going on Across AP:అంగన్వాడీల నిరవధిక దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా (Anganwadi workers strike in AP) కొనసాగుతూనే ఉంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 13 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
అక్కచెల్లెమ్మల బాధ విను జగనన్నా - నేనున్నాను, నేను విన్నానంటివి కదా
అనంతపురం జిల్లా గుత్తిలో అంగన్వాడీలుకొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. అనంతపురంలో టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. కుప్పం పర్యటనలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడీలు జీతాలు పెంచడంతోపాటు డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న తమను చూసి ఎమ్మెల్సీ భరత్ నవ్వుతూ కారులో వెళ్లిపోయారంటూ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మూడు రోడ్ల కూడలి, అంబేడ్కర్ విగ్రహం ఎదుట అంగన్వాడీలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. మైదుకూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ పిల్లలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. కడప పాత బస్టాండ్ వద్ద అంగన్వాడీలు కొవ్వొత్తులు చేతపట్టి మానవహారంగా ఏర్పడ్డారు.
అక్రమ అరెస్టులపై కాదు - అంగన్వాడీ సమస్యలపై దృష్టిపెట్టండి : చంద్రబాబు
తల్లిదండ్రులు, చిన్నారులు మద్దతు:బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో కొవ్వొత్తులతో కలియతిరిగారు.పదమూడు రోజుల నుండి నిరసనలువ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 13 రోజులుగా ఆందోళన బాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. అంగన్వాడీలు చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు స్థానిక తల్లిదండ్రులు, చిన్నారులు మద్దతు తెలిపారు.
జగన్ మామయ్య! ఇచ్చిన మాట ప్రకారం మా అమ్మలకు జీతాలు పెంచండి- ఆరో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
ఫోన్లకు, చీరలకు పూజలు:అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో అంగన్వాడీలు కొవ్వొత్తులతో భారీ ప్రదర్శననిర్వహించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 13 రోజులుగా తమ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం ప్రధాన రహదారిపై అంగన్వాడీలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో రోడ్డుపై నిల్చుని కొవ్వొత్తులు వెలిగించి ప్రభుత్వానికి వ్యతిరేంకగా నినాదాలు చేశారు. పార్వతీపురంలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అంగన్వాడీలు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. శ్రీకాకుళం నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట అంగన్వాడీలు, చిన్నారులు, తల్లిదండ్రులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, చీరలకు పూజలు చేస్తూ విజయనగరం, రాజాంలో అంగన్వాడీలు నిరసన తెలిపారు.