రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో మొదటి కేసు నమోదైన 20 రోజుల్లోనే వైరస్ సోకిన వారి సంఖ్య 114కి చేరటం ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలో మార్చి 13న తొలికేసు నమోదు కాగా... గుంటూరు జిల్లాలో మార్చి 25న గుర్తించారు. దిల్లీలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 52 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మార్చి 27న అతని భార్యకు, 28న మాచర్లకు చెందిన మరో ఇద్దరికి వైరస్ సోకినట్లు వెల్లడైంది. ఈనెల 10 వరకూ జిల్లాలో నమోదైన కేసులు 50 మాత్రమే. ఆ తర్వాత కేవలం 5 రోజుల వ్యవధిలో మరో 64 కేసులు నమోదయ్యాయి.
పరిస్థితి తీవ్రరూపం...
గుంటూరు జిల్లాలో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను ఆస్పత్రులకు తరలించారు. వారు కలిసిన వారిని మాత్రం క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. ఇదే వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్న వారిని, వారిని కలిసిన వారిని కూడా ఆస్పత్రుల్లోని ఐసొలేషన్ విభాగాల్లో చేర్చి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేది కాదనే భావన వ్యక్తమవుతోంది. అనుమానితుల తరలింపులోనూ ఉదాసీనత కనిపించింది. ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నదాన్ని బట్టే వారిని చేర్చుకున్నారు. లేకుంటే ఇళ్లలోనే ఉంచారు. ఫలితంగా.. ఆ ఇళ్లలో మిగిలిన కుటుంబ సభ్యులకూ కరోనా సోకింది. ఒకే ఇంట్లో 4కు మించి పాజిటివ్ కేసులు మొత్తం 6 ప్రాంతాల్లో నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. గుంటూరు నగరంలో 88 కేసులుండగా.. మిగతా 26 గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. నగరాల్లోని వారు ఇరుకిళ్లలో ఉండటం, ఒకే మరుగుదొడ్డి ఉపయోగించటం లాంటివి వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.
ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్