ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరిగిన రెండో మాస్క్‌ వినియోగం.. వైద్యుల సూచనలతో ఆచరిస్తున్న జనం

కరోనా మొదటి విడత వచ్చినప్పుడు ఒక మాస్క్‌ మాత్రమే ధరించేవారు.. ప్రస్తుతం రెండో విడతలో రెండు మాస్క్‌లు పెట్టుకోవడం సాధారణంగా మారింది.. వైద్య నిపుణుల సూచనలు, సామాజిక మాధ్యమాల్లో విస్త్రృత ప్రచారం.. కారణం ఏదైనా కావచ్చు.. గుంటూరు జిల్లాలో రెండు మాస్క్‌ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. వైద్య నిపుణుల సూచనలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

పెరిగిన రెండు మాస్కుల వినియోగం
పెరిగిన రెండు మాస్కుల వినియోగం

By

Published : May 16, 2021, 2:26 PM IST

రెండు మాస్క్‌లు పెట్టుకోవడం ద్వారా బయట వైపు ఉన్న మాస్క్‌ వలన లోపలవైపు ఉన్న మాస్క్‌ అంచులపై ఒత్తిడి పడుతోంది. తద్వారా అది పూర్తిగా మూసుకుపోయి సరిగ్గా ముఖానికి అతుక్కుపోతాయి. ఇలా చేయడం ద్వారా ఎవరైనా దగ్గినా, తుమ్మినా, చీదినా వాటి నుంచి వచ్చే తుంపర్లు కూడా రెండు మాస్క్‌లు అడ్డుకుంటాయి. తద్వారా మరింత జాగ్రత్తగా ఉండవచ్చునని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు. సామాజిక స్పృహ ఎక్కువగా ఉండే డెల్టా ప్రాంతంలోని బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో యువత రెండు మాస్క్‌లు ధరించడం అలవాటు చేసుకున్నారు. ఇంట్లో పెద్దవారు కూడా ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయ పనులకు వెళ్లేవారు కూడా రెండో మాస్క్‌ ధరించే ప్రయత్నం చేస్తున్నారు.

చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో ఉదయం నిత్యావసరాల కొనుగోలుకు బయటకు వచ్చినప్పుడు మెజారిటీ ప్రజలు రెండో మాస్క్‌ ధరిస్తున్నారు. జన సమూహంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా రెండో మాస్క్‌ అప్పటికప్పుడైనా పెట్టుకుంటున్నారు. పల్నాడు ప్రాంతమైనా మాచర్ల, గురజాల ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవారు, ప్రైవేటు ఉద్యోగులు తప్పనిసరిగా రెండింటిని ధరిస్తున్నారు. ప్రజలతో వ్యవహారాలు సాగించేవారు ఫేస్‌షీల్డ్‌ వంటివి పెట్టుకుంటున్నారు. బస్సు, ఆటోలలో ప్రయాణించేటప్పుడు, కూడళ్లకు వెళ్లే సమయంలో రెండు మాస్క్‌లు ధరించడం ద్వారా కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చునని చెబుతున్నారు. మహమ్మారి బారినపడకుండా రెండింటిని ధరించడం అలవాటుగా చేసుకుంటున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

తొంభై శాతంపైగా వైరస్‌ నుంచి రక్షణ..

రెండు మాస్క్‌లు పెట్టుకోవడం ద్వారా 94.6 శాతం కరోనా వైరస్‌ నుంచి రక్షణ ఉంటుంది. సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీపీ) సంస్థ రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు రెండు మాస్క్‌లు పెట్టుకోవడం ద్వారా ఎక్కువ శాతం వైరస్‌ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది. ప్రతిఒక్కరూ ధరించే రెండు మాస్క్‌లు ముక్కు, నోరు, గడ్డం పూర్తిగా కవరయ్యేలా ఉండటం ముఖ్యం. సాధారణ పద్ధతిలో సర్జికల్‌ మాస్క్‌ ధరించినప్పుడు అది 56.1 శాతం ప్రభావవంతంగా ఉంటుంది. అదే రెండో మాస్క్‌ ధరిస్తే 90 శాతానికి పైగా కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎన్‌-95 మాస్క్‌ ఉపయోగించేటప్పుడు మరో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదు. రెండు మాస్క్‌లు ధరించినప్పుడు మనం ఊపిరి పీల్చినప్పుడు ముక్కు దగ్గర మాస్క్‌ లోపలకు ప్రెస్‌ అవ్వాలి. ధరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలకు మాత్రం ఒక్క మాస్క్‌ సరిపోతుందని - డాక్టర్‌ కె.వాసు, కందిమళ్ల స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు

ఇవీ చూడండి:

ఎంపీ రఘురామకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు.. నివేదిక కోసం కోర్టు నిరీక్షణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details