'చేరికల విషయంలో దూకుడు పెంచాలి' - bjp
తెదేపా, జనసేనల నుంచి వీలైనంత ఎక్కువమంది నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాలని భాజపా నేతలు నిర్ణయించారు. మంగళగిరిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల భేటీలో పలు అంశాలపై చర్చించారు.

గుంటూరు జిల్లా మంగళగిరి హాయ్‌ల్యాండ్ లో రెండో రోజు భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ హాజరయ్యారు. ఏపీలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రభుత్వంతో వ్యవహారించాల్సిన వైఖరిపై చర్చించారు. తెదేపా, జనసేన నుంచి వీలైనంత ఎక్కువ మంది నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. సంప్రదింపుల బాధ్యతల్ని కొంతమంది నేతలకు అధిష్ఠానం అప్పగించింది. పార్టీ సభ్యత్వ నమోదు 40 లక్షల వరకూ పెంచేలా లక్ష్యం నిర్దేశించినట్లు నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాలనపై కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అమ్మఒడి పథకం, ప్రజావేదిక కూల్చివేత అంశాల్లో ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. భాజపా, వైకాపా ఒకటేనన్న అపోహను తొలగించేలా వ్యవహారించాలని నేతలు నిర్ణయించారు.