High Court on Republic Day Celebrations: గణతంత్ర వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్ డే వేళ పరేడ్ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవాలకు ప్రజలను అనుమతించాలని సూచించింది. కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
దీనిపై వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకి వివరణ ఇచ్చారు. ఈనెల 13వ తేదీనే రాజ్‌భవన్‌కు లేఖ రాశామని.. రాష్ట్రంలో కొవిడ్ ఉన్నందున రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలని కోరినట్లు కోర్టుకు తెలిపారు. రాజ్ భవన్‌లో వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని ఏజీ తెలిపారు. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలను ప్రజలు చూసేందుకు వెబ్ కాస్టింగ్ చేస్తామని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం.. గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న ఇచ్చిన మార్గదర్శకాలన్నింటినీ పాటించాలని ఆదేశించింది.
ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నట్లయితే.. కొవిడ్ ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. కాబట్టి వీటన్నింటిని తాము పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన జాతీయ పండగ అని.. దేశభక్తిని చాటిచెప్పే పండగ అని వ్యాఖ్యానించింది. గణతంత్ర స్ఫూర్తిని చాటేలా ఘనంగా వేడుకలు జరపాలన్న హైకోర్టు... పరేడ్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో మాదిరిగా గణతంత్ర వేడుకలు జరిపేలా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.