గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. పొలాల కింద రిజిస్ట్రేషన్లూ జరిగాయి. స్థానికుల ఫిర్యాదులపై ఆరా తీయగా వాస్తవాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. నరసరావుపేట సబ్ కలెక్టర్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు విడివిడిగా విచారణ జరుపుతున్నారు. ఈ గ్రామం వద్ద 53 ఎకరాల చెరువు పోరంబోకు కింద ఉంది. ఈ భూమి ఆక్రమణలకు గురవుతోందని జిల్లా ఉన్నతాధికారులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఫిర్యాదులు అందాయి. దీనిపై జరిపిన విచారణలో 2002 నుంచి 2015 సంవత్సరాల మధ్య చెరువు పోరంబోకు భూమిలో సుమారు 35 ఎకరాలకు సంబంధించి 20 వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించారు.
Land registrations: చెరువు పోరంబోకు భూమికి రిజిస్ట్రేషన్లు - వినుకొండలో చెరువు భూమి కబ్జా
ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జా చేసేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు తెలీకుండానే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఓ ప్రాంతంలో చెరువు భూమిని ..రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు.
రిజిస్ట్రేషన్లు జరిగిన సమయంలో నిషిద్ధ భూముల జాబితా పక్కాగా లేకపోవడం, నిశితంగా పరిశీలించకపోవడంతో యథావిధిగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆక్రమణలో ఉన్న భూమికి సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఎం.శేషగిరిబాబు, జిల్లా కలెక్టర్‌కు నరసరావుపేట రిజిస్ట్రేషన్ శాఖ అధికారి తెలియజేశారు. ఆక్రమణలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాలంటే ఈ వ్యవహారాన్ని సీఐడీ ద్వారా విచారణ జరిపించాలని భావించిన ఐజీ శేషగిరిబాబు ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఈ భూమికి సంబంధించి ఎమ్మార్వో కార్యాలయం నుంచి ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? రెవెన్యూ సిబ్బంది పాత్ర ఎంత? రిజిస్ట్రేషన్ల సమయంలో ఏయే డాక్యుమెంట్లు సమర్పించారు అన్న వివరాలపై నరసరావుపేట సబ్‌కలెక్టర్ త్వరలోనే నివేదికను సమర్పించనున్నారు.
ఇదీ చూడండి.polavaram: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు!