ILLEGAL MINING IN GUNTUR : పాతాళం లోతు ఎంతంటే చెప్పడం కష్టం కావచ్చు గానీ.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో సాగుతున్న విచ్చలవిడి అక్రమ మైనింగ్ ప్రాంతాలను పరిశీలిస్తే మాత్రం.. బహుశా ఇలాగే ఉంటుందేమో అనిపించకమానదు. మండల పరిధిలోని శేకూరు, శలపాడు, సుద్దపల్లి, వీరనాయనిపాలెం, వడ్లమూడిలో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్న అక్రమార్కులు.. గ్రామాలను సర్వనాశనం చేస్తున్నారు. అయినా అడిగే నాథుడే లేడు. మట్టి తవ్వకాలపై నిఘా పెట్టాల్సిన గనులశాఖ.. సిబ్బంది కొరత పేరిట చేతులెత్తేసింది. స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన కరవైంది. ఇంకేముంది.. ఎమ్మెల్యే మా వెనుకున్నారంటూ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అనకొండల్లా ఎర్రమట్టిని మింగేస్తున్నారు.
చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎర్రనేల భూములున్నది చేబ్రోలు మండలంలోనే. అందుకే ఇక్కడి మట్టికి డిమాండ్ ఎక్కువ. ఇదే అదునుగా మట్టి మాఫియా ఇక్కడి గ్రామాలపై పడింది. ప్రైవేటు భూములను ఎకరా 40 లక్షల చొప్పున కొనేస్తున్న మాఫియా గ్యాంగ్... మైనింగ్ సహా ఇతర సమస్యలు రాకుండా ప్రజాప్రతినిధికి ముడుపులు ముట్టజెబుతున్నారు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లు... భారీ యంత్రాలతో అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.
"నాకు పూర్వీకుల నుంచి వచ్చిన 80 సెంట్ల పొలం ఉంది. సపోటా తోట వేసుకుని జీవిస్తున్నా. మట్టి తవ్వకం కోసం భూమిని అమ్మాలని కొందరు బెదిరిస్తున్నారు. అమ్మేది లేదని చెప్పా. నీ పొలానికి నీళ్లు ఎలా వస్తాయో చూస్తామని హెచ్చరిస్తున్నారు. మా గ్రామాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఏం చేయాలనుకుంటున్నారు? ఊళ్లోవాళ్లు బతకాలా... వద్దా?"-గాలి నిర్మల, శేకూరు, చేబ్రోలు మండలం
మట్టి తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. వంద అడుగులు దాటి మరీ తవ్వేసిన చోట్ల ఊట ఉబికి వస్తే... ట్రాక్టర్ ఇంజిన్లతో నీటిని తోడేసి... మళ్లీ పని మొదలుపెడతున్నారు. ఈ దారుణాలతో ఊళ్లు నాశనమవుతున్నాయంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగితే... పోలీసులతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మట్టి లారీలను అడ్డుకుంటే.. దాడులకూ తెగబడుతున్నారు. అంతటితో ఆగకుండా.. ఎదురుకేసులతో వేధిస్తున్నారు.