ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Illegal Soil Mining: కొండల్ని మింగేస్తున్న అనకొండలు.. యథేచ్ఛగా తవ్వుకో..అమ్ముకో.. తినుకో.!

Illegal Soil Mining in AP: రాష్ట్రంలో మట్టిమాఫియా అరాచకాలకు.. అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. KGF సిరీస్‌ సినిమాల్లో విలన్‌ పాత్రధారి గరుడ అకృత్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పాటు తప్పుదు. రాష్ట్రంలోని మాట్టిమాఫియా అంతకుమించిన అరాచకాలకు పాల్పడుతోంది. మండలానికో కేజీఎఫ్‌ చిత్రం, ఊరికో గరుడ పాత్రను రాష్ట్రంలోని పరిస్థితులు తలపిస్తున్నాయి. ఎక్కడైనా మట్టి, గ్రావెల్‌ కన్పిస్తే చాలు.. రాబందుల్లా వాలిపోతున్న వైసీపీ నాయకులు..యథేచ్ఛగా తవ్వేస్తూ.. టిప్పర్లు, లారీల్లో తరలించుకుపోతున్నారు. వేసవి వేళ చెరువుల్లో నీరు ఇంకిపోవడమే అదనుగా మట్టిరాక్షసులు మరింత లోతుకు చెరబట్టే ప్రమాదం ఉందంటున్న పర్యావరణవేత్తలు.. ప్రభుత్వం చేష్టలుడిగి చూడకుండా.. మట్టి దందాకు అడ్డుకట్ట వేసి, ప్రకృతి సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Illegal Soil Mining in AP
Illegal Soil Mining in AP

By

Published : Apr 28, 2023, 7:01 AM IST

Updated : Apr 28, 2023, 8:01 AM IST

కొండల్ని మింగేస్తున్న అనకొండలు.. యథేచ్ఛగా తవ్వుకో..అమ్ముకో.. తినుకో.!

Illegal Soil Mining in AP: ప్రతిపక్ష నేత హోదాలో గన్నవరం నియోజకవర్గంలోని బ్రహ్మలింగయ్య చెరువును సందర్శించినప్పుడు జగన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'ఈ దారుణానికి కారకులైన ఎవరినీ ముఖ్యమంత్రి అయ్యాక వదిలి పెట్టను. మట్టి మింగినవారికి శిక్షలు పడాల్సిందే' అని వ్యాఖ్యానించారు. అంత ఘంటాపథంగా చెప్పిన జగన్‌.. సీఎం అయ్యాక రాష్ట్రంలో అసలు మట్టి మాఫియా ఊసే వినపడదు అనుకుంటే.. అంతకంటే పెద్ద జోక్‌ మరొకటి ఉండదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రహ్మలింగయ్య చెరువు సమీపంలోని కొండ పావులూరు, బీబీగూడెం, గోపవరం, వీరపనేనిగూడెం, గొల్లనపల్లి ప్రాంతాల్లో మట్టి తవ్వని కొండ అంటూ లేనే లేదు. 100 హెక్టార్ల లోపు తవ్వకాలకు అనుమతిస్తే వెయ్యి హెక్టార్లలో మైనింగ్‌ చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మట్టి తవ్వకాలు జోరుగు సాగుతున్నాయి.

లేనిపోని తలనొప్పి ఎందుకని సైలెంట్​గా ఉంటున్న అధికారులు: రాష్ట్రంలో మట్టి మేతగాళ్లదే రాజ్యంగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో నెలల తరబడి ఒకేచోట అక్రమంగా మైనింగ్‌ జరుగుతున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పోలీస్‌స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల ముందు నుంచే మట్టితో లారీలు, టిప్పర్లు తిరుగుతున్నా.. అధికారులు ఏమీ తెలియదన్నట్లుగా పట్టించుకోవడం లేదు. నిఘా వ్యవస్థలు అన్నీ తెలిసినా ఏమీ ఎరగనట్లు వ్యవహరిస్తున్నాయి. అడ్డుకొంటే ఏ నాయకుడి నుంచి ఫోన్‌ వస్తుందోనన్న భయంతో లేనిపోని తలపోటు ఎందుకని భావిస్తూ అధికారులు మిన్నకుండిపోతున్నారు.

ఎన్ని కథనాలు వచ్చినా కొట్టిపారేస్తున్న ప్రభుత్వ పెద్దలు: మట్టిమాఫియా మామూళ్లకు అలవాటు పడిన కొందరు అధికారులు.. ప్రశ్నించకుండా వదిలేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతల నుంచి స్థానిక నాయకుల వరకు కొందరు ఇసుక అక్రమ దందాలో దోచుకో, పంచుకో, తినుకో- DPT విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా మట్టిలో జరిగిన DPT ఐదారు వేల కోట్ల రూపాయల వరకు ఉన్నా.. ముఖ్యమంత్రి, గనులు, రెవెన్యూ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల్లో ఎవరూ తీవ్రంగా పరిగణించి, సమీక్షించిన దాఖలా లేదు. అక్రమ తవ్వకాలపై మీడియా కథనాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, స్థానికుల ఆందోళనలు, విపక్షాల పర్యటనలు, మట్టి లారీల అడ్డగింతలను ప్రభుత్వ పెద్దలు తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.

సీఎం జగన్​ కొనుకున్న భూముల్లో ఆయనకు తెలియకుండానే దోపిడి: కృష్ణా జిల్లాలో పోలవరం గట్లు.. కొత్తూరు తాడేపల్లిలో భూములు.. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు.. పశ్చిమగోదావరి జిల్లాలో నారప్ప చెరువు.. అనంతపురం జిల్లాలో చెన్నకేశవస్వామి ఆలయ మాన్యం భూములు.. రాజధాని అమరావతిలో రోడ్లు.. కర్నూలు జిల్లాలో జగన్నాథగట్టు.. ప్రకాశం జిల్లాలో యరజర్ల, మర్లపాడు కొండలు.. కాకినాడ జిల్లాలో రామేశ్వరంమెట్ట.. ఇలా అంతటా అన్ని రకాల వనరులపై పడ్డ మాఫియా.. సంపదను దోచుకుంటోంది. ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తోంది. ప్రభుత్వ ఉదాసీనత, కొన్నిచోట్ల ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లాలో సరస్వతి సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం సీఎం జగన్‌ కుటుంబం కొనుక్కున్న భూముల్లోని మట్టినీ ఆయనకు తెలియకుండానే తవ్వేసి తరలించుకుపోయారు.

లక్షల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్న నేతలు: వైసీపీ ముఖ్య నేతలు ఇసుక, మద్యం, గనుల్లో దోచుకో.. పంచుకో.. తినుకో-DPT స్కీంను గంపగుత్తగా అమలు చేస్తుంటే.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా క్షేత్రస్థాయి నాయకులు మట్టి దోపిడీలో 'DPT’ని రీటెయిల్‌గా పంచుకుంటున్నారు. కొల్లగొట్టిన మట్టి, గ్రావెల్‌ను రహదారుల నిర్మాణానికి, స్థిరాస్తి వెంచర్లలోని స్థలాల చదునుకు, ఇటుక బట్టీలకు అమ్మేస్తూ భారీగా ధనార్జన చేస్తున్నారు. కొందరైతే నిత్యం లక్షల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నారు. మట్టి తవ్వకాలకు ప్రాథమికంగా ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరిగా మారగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో స్థానిక ఇన్‌ఛార్జులు ఆ వ్యవహారాలు చూస్తున్నారు. వారి అనుయాయులకు ప్రాంతాల వారీగా పంచిపెట్టారు. వారి సంపాదనలో ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

మట్టి దందాలో కీలక మంత్రులు: కొన్నిచోట్ల కీలక మంత్రులూ ఈ దందాలో కూరుకుపోయారు. విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లి వద్ద మట్టి తవ్వకాల వెనుక ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి, రాజధాని ప్రాంతంలో నివాసముంటున్న కీలక నేతల హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ మాజీ మంత్రితో పాటు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి మామ నియోజకవర్గంలోని మట్టి తవ్వకాల్ని నియంత్రిస్తున్నారు. సొంతింటి కోసం మట్టి తవ్వుకునే వారూ ఆయనకు కప్పం కట్టాల్సిందే. కాకినాడ జిల్లాలో సీఎంకు సన్నిహితుడిగా భావించే ఓ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మైనింగ్‌ జరుగుతోంది.

పరిమితులకు మించి తవ్వకాలు: రాష్ట్రంలో చాలా చోట్ల మట్టి తవ్వకాలకు అనుమతుల్లేకపోగా, ఉన్న చోట పరిమితులకు మించి తవ్వేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొత్తూరు తాడేపల్లి, పోలవరం కాలువ గట్లు, కొండపావులూరు, ఆగిరిపల్లి, నున్న గుట్టల్లోనే సుమారు 76 లక్షల ఘనపు మీటర్లకు పైగా అక్రమంగా తవ్వేశారని అంచనా. దానికి కట్టాల్సిన పన్ను సుమారు 120 కోట్ల రూపాయలు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ విలువ చాలా ఎక్కువ. ఉమ్మడి 13 జిల్లాలకు సగటున జిల్లాకో 200 కోట్ల చొప్పున గణించినా ప్రభుత్వానికి 2 వేల 600 కోట్ల వరకు గండిపడింది. మట్టి మాఫియా దోపిడీ విలువ 5వేల కోట్ల నుంచి 6వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు: ఆరు టైర్లున్న టిప్పర్‌లో 12 ఘనపు మీటర్ల మట్టి పడుతుంది. ఒక్కో టిప్పర్‌ మట్టిని రవాణా ఛార్జీలతో కలిపి వినియోగదారులకు దూరాన్ని, నాణ్యతను బట్టి 6 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. పట్టాభూమిలో తవ్వాలంటే తాత్కాలిక అనుమతి కోరుతూ గనులశాఖ ఉపసంచాలకునికి దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై తహసీల్దారు కార్యాలయంలో నిరభ్యంతర పత్రమిస్తే.. అది మళ్లీ గనులశాఖ డీడీకి వస్తుంది. ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, మట్టి తవ్వేందుకు భూమి అనుకూలమని భావిస్తే 90 రోజుల కాలానికి తాత్కాలిక పర్మిట్లు జారీ చేస్తారు.

ఒక్కో ఘనపు మీటర్‌ మట్టికి 45 రూపాయల సీనరేజ్, 45 రూపాయల కన్సిడరేషన్‌ ఫీజు, సీనరేజ్‌పై 30 శాతం జిల్లా ఖనిజ నిధికి, ఖనిజాన్వేషణ ట్రస్టుకు 2 శాతం, ఆదాయ పన్ను 2 శాతం కలిపి ప్రభుత్వానికి 104 రూపాయల చొప్పున చెల్లించాలి. పట్టా భూమిలో 6మీటర్ల లోతు వరకే తవ్వాలి. ఆ మట్టిని పొలాల చదునుకు మాత్రమే వాడాలి. ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ లేదా పట్టాభూమిలో మట్టి తవ్వాలన్నా అనుమతి 90 రోజులకే ఉంటుంది. మట్టి వ్యాపారానికైతే ఐదేళ్ల కాలానికి ఈ-వేలంలో పాల్గొని లీజుకు తీసుకోవాలి. అక్కడా ఘనపు మీటర్‌కు పన్ను 104 మాత్రమే. అయితే, పోలవరం కాల్వ గట్టు మట్టిని తవ్వి తరలించాలంటే గనులశాఖకు 104 రూపాయలు, జలవనరుల శాఖకు 114 రూపాయలు చొప్పున చెల్లించాలి. కానీ చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుపుతూ దోపిడీకి పాల్పడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 28, 2023, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details