ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sand Mining: పట్టపగలే ఇసుక అక్రమ తవ్వకాలు.. వైఎస్సార్​సీపీ నాయకుల అండదండలతోనే.. - ఇసుక అక్రమ మైనింగ్​

Illegal Sand Mining: థగ్గులు, పిండారీలు వంటి కరడుగట్టిన దోపిడీదారులకైనా కాస్తో కూస్తో నీతి, నియమం ఉంటాయేమో. కానీ, ఇసుకాసురులకు మాత్రం అలాంటివేమీ లేవు. రాజ్యాంగం, చట్టాలు, కోర్టులు అంటే లెక్కలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి, నీవా, అరణియార్‌ నదుల్లో.. వైఎస్సార్​సీపీ నాయకుల ఆధ్వర్యంలో దోపిడీదారులు పట్టపగలే నిస్సిగ్గుగా ఇసుక తోడేస్తున్నారు. ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా.. పూచికపుల్లలా తీసిపడేసి ఇసుక దోచేస్తున్నారు. రోజూ వందల లారీల్లో పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అరణియార్‌ నదిపై రీచ్‌ల వద్ద తవ్వకాలకు ఎవరూ అడ్డుపడకుండా పోలీసులే కాపలా కాస్తూ, ఇసుక దోపిడీకి సహకరిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 19, 2023, 10:06 AM IST

పట్టపగలే నిస్సిగ్గుగా ఇసుక అక్రమ తవ్వకాలు.. వైసీపీ నాయకుల అండదండలతోనే

Illegal Sand Mining Under YSRCP Leaders: వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థీకృతమైన ఇసుక దోపిడీ చివరి ఏడాదిలో పతాకస్థాయికి చేరింది. ఎన్నికలు వచ్చేలోగా వీలైనంత ఎక్కువ దోపిడీ చేసేందుకు కోర్టుల ఉత్తర్వుల్నీ ధిక్కరించి.. ఇసుకను కొల్లగొడుతున్నారు. చిత్తూరు జిల్లాలోని అరణియార్‌, స్వర్ణముఖి, నీవా నదుల్లోని 15రీచుల్లో తవ్వకాలు నిలిపేయాలని ఎన్జీటీ మార్చి నెలలోనే ఆదేశాలిచ్చినా.. ఇప్పటివరకూ గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోలేదు. జేపీ సంస్థ పేరిట ఇసుక తవ్వకాలు చేస్తున్న వైఎస్సార్​సీపీ నాయకులకు.. గనులశాఖతో పాటు, ఇతర శాఖలు దాసోహమయ్యాయి. ఇసుక తవ్వకాలు ఆపేశామని ఉత్తుత్తి ప్రకటన జారీ చేశారు.

రాష్ట్రం మొత్తంలో ఇసుక దందాను జేపీ సంస్థ చేతిలో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దానిలో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అరణియార్‌ నదీ పరీవాహకంలోని నాగలాపురం మండలంలో 12 రీచ్‌లు, స్వర్ణముఖి నదీ పరీవాహకంలో ఏర్పేడు మండలంలో రెండు రీచ్‌లు, నీవా పరీవాహకంలో చిత్తూరు మండలంలో రెండు, గంగాధరనెల్లూరు మండలంలో ఒకటి, కాళంగి నదిలో ఒకటి కలిపి మొత్తం 18 రీచ్‌లను జేపీ సంస్థకు కట్టబెట్టింది. పేరుకే జేపీ సంస్థగానీ.. అవి వైఎస్సార్​సీపీ నాయకుడి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దానికి పెద్దాయన ఆశీస్సులు, అండదండలున్నాయని సమాచారం.

ఇసుక తవ్వకాలు నిలిపేయాలన్న ఎన్జీటీ: ఈ ప్రాంతంలో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరపడంపై స్థానికులు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరణియార్‌ నదిలో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వేయడంతో ఆయకట్టుకు నీరు అందదని, పరిసర గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని ఒకరు జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. చెన్నైలోని ఎన్జీటీ బెంచ్‌ దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో కమిటీ వేసింది. అధికారుల బృందం పరిశీలించి అక్రమ తవ్వకాలు నిర్ధారించి, నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక మేరకు 18 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు తక్షణం నిలిపివేయాలని ఈ ఏడాది మార్చి 23న ఎన్జీటీ ఆదేశించింది.

సుప్రీం ఉత్తర్వులను ఇసుకలో తొక్కి: ఇసుకాసురులు మాత్రం ఎన్జీటీ ఉత్తర్వుల్ని పట్టించుకోకుండా.. తవ్వకాలు కొనసాగించారు. మరోవైపు ఎన్జీటీ తీర్పును జేపీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వుల్నే సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈనెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ తీర్పు తర్వాత కూడా ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగటంపై ‘ఈనాడు’లో కథనం రావడంతో, గనులశాఖ అధికారులు ఈనెల 15న ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 18 ఇసుక రీచ్‌లకు అనుమతులు రద్దు చేశామని తెలిపారు.

కానీ.. ఇప్పటికీ యథేచ్చగా తవ్వకాలు జరుగుతున్నాయి. నీవా నదిలోని ఆనగల్లు, ముత్తుకూరు రీచ్‌లు, కాళంగి నదిలోని తాహానగర్‌-1 రీచ్‌ల్లో ఇసుక లభ్యత తగ్గిపోవడంతో.. ఎన్జీటీ ఉత్తర్వులకు ముందే తవ్వకాలు నిలిపేసినట్టు తెలిసింది. మిగతా 15 రీచ్‌లలో 13 చోట్ల ఉద్ధృతంగానూ, రెండుచోట్ల స్థానిక వైసీపీ నాయకుల నియంత్రణలో.. తవ్వకాలు సాగుతున్నాయి. భారీయంత్రాలతో పెద్దసంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో ఇసుక నింపి తరలిస్తున్నారు.

కప్పం కడితే తిరుగేలేదు: గంగాధర నెల్లూరు మండలంలో నీవా నదిలో ఉన్న కొట్రకోన-నందనూరు రీచ్‌లో రోజుకు 300 ట్రాక్టర్లకు పైగా ఇసుక తరలిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. అక్కడొక వ్యక్తి కూర్చుని, రీచ్‌లోంచి వెళ్లే వాహనాల నెంబర్లు రాసుకుంటున్నారు. ఏర్పేడు మండలంలోని స్వర్ణముఖి నదిలో మోదుగులపాలెం,ముసలిపేడు రీచ్‌లలో స్థానిక వైఎస్సార్​సీపీ నాయకుల నియంత్రణలో ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. వారికి కప్పం కట్టినవారికి చిట్టీలు ఇస్తున్నారు. అవి ఉన్న వాహనాల్ని పోలీసులు అడ్డుకోవడం లేదు. స్లిప్‌లు లేకుండా ఇసుక తీసుకెళుతున్న వాహనాల్ని సీజ్‌ చేస్తున్నారు.

కొండల్ని తలపిస్తున్న ఇసుక నిల్వలు: అరణియార్‌ నదిపై 12 ఇసుక రీచ్‌లున్నాయి. ఒక రీచ్‌కీ మరోదానికీ మధ్య దూరం.. 50 నుంచి 100 మీటర్లు మాత్రమే. ఈ రీచ్‌లన్నీ చెన్నై వెళ్లే జాతీయ రహదారికి సమీపంలోనే ఉన్నాయి. ఇసుక తవ్వుతున్న పొక్లెయిన్ల రణగొణ ధ్వనులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, వచ్చే పోయే వందల వాహనాలతో అక్కడి వాతావరణం జాతరను తలపిస్తోంది. అక్కడ రోడ్డుకు ఒకపక్క రీచ్‌లు ఉండగా, రోడ్డుకు రెండో పక్క రెండు స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి, భారీగా ఇసుక నిల్వ చేశారు. ఆ నిల్వలు చిన్నపాటి కొండల్ని తలపిస్తున్నాయి. రీచ్‌లలో తవ్వుతున్న ఇసుకలో 80 శాతం స్టాక్‌ పాయింట్లకు తెచ్చిపోస్తున్నారు. మిగిలిన ఇసుకను రీచ్‌లలోనే లారీలు, ట్రాక్టర్లలో నింపి బయటి ప్రాంతాలకు పంపేస్తున్నారు.

పోలీసులు మకాం వేసి మరీ కాపలా: ఒక రీచ్‌లో ప్రస్తుతం తవ్వుతున్న చోట ఇసుక దాదాపుగా అయిపోవడంతో, కొంత లోపలికి వెళ్లి తవ్వేందుకు వీలుగా గ్రావెల్‌తో నదీ గర్భంలోనే రోడ్డు వేస్తున్నారు. ఇసుక రీచ్‌లున్న చోటే గుడిసె వేసుకుని పోలీసులు మకాం ఉంటున్నారు. స్థానికులు వచ్చి ఇసుక తవ్వకాల్ని అడ్డుకోకుండా కాపలా కాస్తున్నారు. ఇసుక కొనుక్కుని తీసుకెళుతున్న వాహనాల డ్రైవర్లకు.. జేపీ సంస్థ పేరుతో ముద్ర వేసి బిల్లులు ఇస్తున్నారు. రోజూ సుమారు 300కి పైగా ట్రక్కుల్లో ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్లలో 400కిపైగా ట్రిప్‌లు వేస్తున్నారు. అరణియార్‌ నదిలో సుమారు నాలుగు మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వేస్తున్నారు.

రైతుల ఆవేదన: పొలాల పక్కనే ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయడంతో భూములు కోతకు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చదునుగా ఉండే అరణియార్‌ ఇపుడు గుంతలమయంగా మారిందని.. వాటిలో పడి మనుషులు, పశువులకు ప్రమాదలకు గురికావాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎన్జీటీ ఉత్తర్వుల్ని బేఖాతరు చేసి, సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించి ఇసుక దొంగలు పేట్రేగిపోతుంటే.. సీఎం జగన్‌, చిత్తూరు జిల్లాకే చెందిన గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మౌనంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details