గుంటూరు జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక పరిధిలో బుసక(మట్టి) పేరుతో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారంటూ.. గాజుల్లంక గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అనుమతులను మించి అధిక లోతులో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల భూగర్భజలాలు అంతరించిపోవడం, సముద్రం నీరు పైకి వచ్చి తాగు, సాగు నీరు ఉప్పు నీరుగా మారిపోతున్నాయంటూ అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు.
నామమాత్రం అనుమతులతో సహజ సంపదను కొల్లగొడుతున్నా.. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతివేగంతో లారీలు నడపడంతో.. రోడ్ల మీద తిరగలేకపోతున్నామని మండిపడ్డారు. గ్రామస్థులు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.