గుంటూరు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖలో అక్రమ మార్గంలో పదోన్నతులు పొందుతున్నారనే విషయం సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి వచ్చింది. పదోన్నతులకు అవకాశం లేని సంక్షేమ, రక్షణ విభాగంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైనాన్ని బయట పెట్టింది కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగే కావటం విశేషం.
సంక్షేమ, రక్షణ విభాగం... గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే ఉండే ఓ చిన్నపాటి ప్రభుత్వ విభాగం. నేరుగా సంయుక్త కలెక్టర్ పర్యవేక్షణలో ఈ శాఖల్లోని ఉద్యోగులు పనిచేస్తారు. 1990వ దశకంలో ఈ మూడు జిల్లాల్లో దళితులపై దాడులు జరిగాయి. ఆ సమయంలో దళితుల సంక్షేమం, రక్షణ కోసమంటూ సంక్షేమ, రక్షణ విభాగాన్ని 1992లో ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాకు 22 పోస్టుల చొప్పున మూడింటికి కలిపి 66 పోస్టులు కల్పించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగులను మాత్రమే ఇందులోకి తీసుకోవాలని జీవో నెంబర్ 38లో పొందుపరిచారు. ఈ విభాగంలో పని చేసేవారికి ఏటా వచ్చే ఇంక్రిమెంట్లు తప్ప పదోన్నతులు ఉండవు.
పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన:
2002 వరకూ అంతా సవ్యంగానే నడిచింది. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ శాఖలోని కొందరు ఉద్యోగులు ఈ విభాగంలోకి వెళ్లడం మొదలైంది. అంతవరకూ బాగానే ఉన్నా... అక్కడ పదోన్నతులు పొందటం ద్వారా నిబంధనలు ఉల్లంఘించారు. సాంఘిక సంక్షేమశాఖలోని అధికారుల ద్వారా ఇప్పటి వరకూ గుంటూరులో 10, ప్రకాశం జిల్లాలో 6గురు పదోన్నతులు పొందారు. కనీస అర్హతలు కూడా లేకుండా పదోన్నతులు ఇవ్వటం ద్వారా అధికారులు నిబంధనలు పాటించలేదు. సరైన అర్హతలు లేకుండా, నిబంధనలు పాటించకుండా పదోన్నతులు పొందటంపై కూచిపూడి ఉదయ్ అనే రెవిన్యూ ఉద్యోగి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు.
గుంటూరులోని సాంఘిక సంక్షేమ శాఖలో అక్రమ మార్గంలో పదోన్నతులు అక్రమాలు ఇవే...
వాచ్మెన్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంక్షేమ, రక్షణ విభాగంలోకి వెళ్లి ఏకంగా టైపిస్టుగా ప్రమోషన్ పొందాడు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులో ఉన్న ఓ ఉద్యోగి అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారిగా పదోన్నతి తీసుకున్నాడు. ఈ పోస్టు కేవలం ఆర్థిక శాఖ ద్వారా మాత్రమే నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వారి డిగ్రీలో గణితం, అర్థశాస్త్రం సబ్జెక్టులుగా ఉండాలి. కానీ ఇంటర్ చదివిన వ్యక్తికి ఏఎస్వోగా పదోన్నతి ఇచ్చారు. ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన వ్యక్తి డిప్యూటీ డైరక్టర్ పోస్టులోకి పదోన్నతిపై వెళ్లారు. ఈ విభాగంలో జీవో ప్రకారం సీనియర్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు ఉంటే ఐదుగా చూపించి ప్రమోషన్లు ఇచ్చారు.
సులువుగా ప్రమోషన్ పొందేందుకు సంక్షేమ, రక్షణ విభాగాన్ని ఓ వేదికగా మార్చుకున్నారు. ఇక్కడ పదోన్నతి వచ్చిన తర్వాత తిరిగి మాతృశాఖలోకి లేదా వేరే ప్రభుత్వ విభాగాల్లోకి వెళ్తారు. పదోన్నతులు పొందిన వారు వేరే ప్రభుత్వ శాఖలకు వెళ్లి అక్కడ మెరుగైన జీతంతో పాటు సీనియారిటీ పొందుతున్నారు. రెవిన్యూ శాఖలో కూడా కొందరు ఇలా వచ్చి చేరారు.
"అక్రమ మార్గంలో ప్రమోషన్ల ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కావటంతో పాటు అనర్హత ఉన్నవారు కీలక పోస్టులు పొందుతున్నారు. అలాంటి వారి నుంచి నాణ్యమైన సేవలు ఆశించలేము. ఎన్నో కీలకమైన బాధ్యతలు ఉండే రెవిన్యూ విభాగంలోకి ఇలాంటి ఉద్యోగులు వచ్చి పదోన్నతులు పొందితే అర్హులకు అన్యాయం జరుగుతుంది. ఉల్లంఘనలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. అధికారులు స్పందించి.. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొందిన వారికి రివర్షన్ ఇవ్వాలి" -కూచిపూడి ఉదయ్, రెవిన్యూ ఉద్యోగి
రెవిన్యూ ఉద్యోగి ఫిర్యాదుతో ప్రస్తుతానికి ప్రమోషన్లకు అడ్డుకట్ట పడింది. కానీ ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఎన్నో చట్టాలు, కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విభాగం అవసరం అంతంత మాత్రమే. ఈ తరుణంలో రక్షణ కోసం ఉద్యోగుల అవసరం ఏమిటనేది ప్రశ్న.
ఇదీ చదవండి:'కర్ణాటక జీవోను.. రాష్ట్రంలో అమలు చేయాలి'