అక్రమ కట్టడాలపై గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు ప్రారంభించారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు కార్యాచరణ సిద్ధం చేశారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రత ఆధారంగా కూల్చివేతలు చేపట్టారు. అయితే మరో వైపు నిర్మాణాలు జరుగుతున్నంత కాలం అధికారుల ఏం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపుగా 10లక్షల మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం కూడా ఏటికేడు విస్తరిస్తోంది. కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఏ నిర్మాణానికైనా ప్రారంభానికి ముందే నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భవన విస్తీర్ణం, అంతస్థుల ఆధారంగా పట్టణ ప్రణాళికా విభాగానికి ఫీజు చెల్లించాలి. కానీ కొందరు ఫీజుల భారం నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపడుతుంటారు. వీటిలో చిన్నచిన్న గృహాల నుంచి బహుళ అంతస్థుల భవనాల వరకూ ఉంటాయి. ఇలాంటి వారి నుంచి ఫీజులు వసూలు చేయకుండా పట్టణ ప్రణాళికా విభాగం ఉద్యోగులు మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ, విజిలెన్స్ విచారణలు జరిగాయి.
ఈ విచారణల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఉద్యోగుల చేతివాటం నిజమేనని తేల్చారు. అలాంటి నిర్మాణాల జాబితాను ప్రభుత్వానికి కూడా పంపించారు. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల్లో చలనం వచ్చింది. అనుమతి లేకుండా కట్టిన భవనాల్ని తొలగిస్తున్నారు. నాలుగు అంశాల ఆధారంగా ప్రాధమ్యాలు నిర్ణయించి వివిధ దశల్లో తొలగించాలని నిర్ణయించారు. కనీసం ప్లాన్ కూడా లేకుండా నిర్మించిన కట్టడాలను మొదటి దశలో తొలగిస్తున్నారు. ఏసీబీ, విజిలెన్స్ నివేదికల్లోని భవనాలు ఈ విభాగంలో ఉన్నాయి. మరికొందరు ప్లాన్ ఉన్నా దాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం.. రెండు అంతస్థులకు అనుమతి తీసుకుని అదనపు అంతస్థులు నిర్మిస్తుంటారు. ఇలాంటి వాటికి సంబంధించి రెండో ప్రాధాన్యంగా కూల్చివేతలు చేపట్టారు. రహదారులపైకి ప్రహారీ గోడలు, మెట్లు నిర్మాణం వంటివి మూడో ప్రాధాన్యంగా చేర్చారు. అక్రమ నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని నగరపాలక సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
"అనుమతులు తీసుకోని నిర్మాణాలు, ప్లాన్ ఉన్నా దాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వాటిని గుర్తించాం. ఏసీబీ ఇచ్చిన నివేదికలోని నిర్మాణాలను కూడా గుర్తించాం. అవసరమైతే పోలీసు వారి సాయం కూడా తీసుకుని నిర్మాణాలను కూల్చివేత, చర్యలు తీసుకుంటాం. నోటీసులు పంపుతాం.సిబ్బందికి కూడా సూచనలు చేశాం. " - చల్లా అనురాధ, కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ