Villagers on Ippatam Incident: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో తొలగించిన ఇళ్లపై అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఆవిర్భావ సభ మార్చి 14న జరిగిందని.. ఏప్రిల్ 22న ఇళ్లు తొలగిస్తామని నోటీసులు ఇచ్చారని గ్రామస్థులు చెప్పారు. కూలీ నాలీ చేసుకుని కొందరు, బ్యాంకులో లోన్లు తెచ్చుకొని మరికొందరు, టిఫిన్ బళ్లు పెట్టుకుని ఇంకొందరు.. తలో విధంగా కష్టపడి సంపాదించుకుని ఇళ్లు కట్టుకున్నారు. అంతా బాగుంది అనుకునేలోపే రోడ్డు విస్తరణంటూ వచ్చి నివాసాలను కూల్చేశారు. కళ్ల ముందే ఇళ్లు కూల్చుతుంటే ఏం చేయలేకపోయారు.. జనసేనాని పవన్ పర్యటన తర్వాత కాస్త ఊరట పొందిన గ్రామస్థులు.. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తప్పును చూస్తూ ఊరుకోబోమని.. పరిహారం రాబడతామని స్పష్టం చేస్తున్నారు.
జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే వైకాపా ప్రభుత్వం కక్ష గట్టి ఇళ్లు కూల్చేసిందని ఇప్పటం వాసులు తేల్చిచెబుతున్నారు. మొత్తం 31 మంది రైతులు తమ భూములను సభ, పార్కింగ్ కోసం ఇచ్చారని.. అప్పటి నుంచి ప్రభుత్వం తమపై కక్ష గట్టిందని వారు చెబుతున్నారు. మార్చిలో సభ జరగ్గా ఏప్రిల్ 22న మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చారు. 1920కి ముందు ఉన్న గ్రామ పటాల ఆధారంగా రహదారి ఆక్రమణకు గురైందని నోటీసుల్లో పేర్కొన్నారు. వెంటనే స్థానికులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి సమస్యను వివరించారు. గ్రామంలో ఇప్పటికే మురుగునీటి డ్రైన్‌లు నిర్మించారని, ఎక్కడా అక్రమణలు జరగలేదని చెప్పారు. అందరి అభిప్రాయంతోనే ముందుకు వెళ్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత ఇళ్ల కూల్చివేతకు అధికారులను పంపించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.