ICAI Disciplinary Committee About MP Vijaya Sai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి, ఆయన గ్రూపు కంపెనీకు ఆర్థిక సలహాదారుగా ఛార్టర్డ్ అకౌంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ సమావేశం తీర్మానించింది. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరు కావలంటూ అక్టోబర్ 23న నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై విజయసాయి రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.
ఈ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో, హెటరోలకు భూకేటాయింపులు , జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, రాంకీ ఫార్మా, వాన్ పిక్ ప్రాజెక్టులు, దాల్మియా సిమెంట్ కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లోని అంశాలను, అందులో సాక్షుల వాగ్మూలాలను ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్ పరిగణనలోకి తీసుకొని తన ప్రాథమిక అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఎంపీ విజయసాయి రెడ్డి సెల్‌ఫోన్ మిస్.. ఏం జరిగింది..?
వీటితో పాటు జగతి పబ్లికేషన్స్ విలువ ముదింపుపై డెలాయిట్ ఇచ్చిన నివేదిక, విజయసాయి రెడ్డి చిరునామాలపై ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. 2017, 2021, 2022ల్లో మూడు ధపాలుగా వెల్లడించిన ప్రాథమిక అభిప్రాయాల్లో విజయసాయి రెడ్డి దుష్ర్పవర్తనకు పాల్పడినట్లు వెల్లడించింది. ఇదే అభిప్రాయంతో క్రమ శిక్షణ కమిటీ ఏకీభవిస్తూ తుది నిర్ణయం నిమిత్తం విచారణ చేపట్టాలని నిర్ణయించి విజయసాయి రెడ్డికి తాఖీదు పంపింది. ప్రాథమిక నిర్ణయం వెలువరించడానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో సమస్య లేకుండా సిమెంట్ పరిశ్రమ నిర్మించుకోవడానికి జగన్‌కు చెందిన జగతిలో 5 కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టాలని జయలక్ష్మీ టెక్స్‌టైల్ అధినేత కన్నన్‌పై సాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆయన 2008 ఆగస్టు 5న ఐదు కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టారు. వాటిపై కన్నన్‌కు ఎలాంటి డివిడెంట్ అందలేదు. పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. 2008 నవంబరులో ఎన్నారై మాధవ్ రామచంద్రకు జగతి నుంచి పెట్టుబడులు పెడుతూ ఫోన్ వచ్చింది.