Telangana New CS Shanti Kumari : తెలంగాణకు తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. సోమేశ్‌కుమార్ స్థానంలో కొత్త సీఎస్‌గా శాంతికుమారికి బాధ్యతలు అప్పగించారు. హైకోర్టు తీర్పు కారణంగా సోమేశ్‌కుమార్ రిలీవ్ నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతికుమారిని ఎంపిక చేయగా... ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో పాటు కొత్త సీఎస్‌ను నియమించాల్సి వచ్చింది. ఆ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తొలి నుంచి ఆసక్తి నెలకొంది. రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిహోదాలో వసుధామిశ్రా, రాణికుమిదిని, శాంతికుమారి, శశాంక్ గోయల్... సునీల్‌శర్మ, రజత్‌కుమార్, రామకృష్ణారావు, అశోక్‌కుమార్, అర్వింద్‌కుమార్ ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రేసులో తొలి నుంచి రామకృష్ణా రావు, శాంతికుమార్ పేర్లు బలంగా వినిపించగా.... సీనియర్ మహిళా అధికారి అయిన శాంతికుమారి వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపారు.
ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్-ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. గతంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్‌గా ఆమె పనిచేశారు.