ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

I Pac Team: గుంటూరు నగర పాలక సమావేశంలో 'ఐ ప్యాక్'​ టీమ్​ దుమారం - Guntur Municipal Corporators dispute

I Pac Team in Guntur: నగరపాలక సంస్థ సమావేశంలో దర్జాగా ఐ ప్యాక్‌ సభ్యులు దర్శనమిచ్చారు. అధికారులతో పాటే ఆసీనులైన ఇద్దరు సభ్యులను టీడీపీ కార్పొరేటర్లు గమనించారు. అనుమానం వచ్చిన వారు ఎవరని ప్రశ్నించగా.. ఐ ప్యాక్​ సభ్యులు జవాబు చెప్పకుండా బయటికి వెళ్లేందుకు యత్నించారు. మరోవైపు సమస్యలపై ప్రశ్నించినందుకు టీడీపీ కార్పొరేటర్లపై.. వైసీపీ కార్పొరేటర్లు దాడికి దిగారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.

I pac Team
ఐ ప్యాక్‌ సభ్యులు

By

Published : Jun 23, 2023, 10:50 PM IST

నగరపాలక సంస్థ సమావేశంలో దర్జాగా ఐ ప్యాక్‌ సభ్యులు

I Pac Team in Guntur Municipal Council Meeting: గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఐ ప్యాక్ బృందం అధికారుల మధ్యలో కూర్చోవడం దుమారం రేపింది. తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఐప్యాక్ టీం అక్కడి నుంచి ఉడాయించింది. మరోవైపు నగరంలో తాగునీటి సమస్య, ఓటర్ల జాబితాలో అక్రమాలపై ప్రతిపక్ష కార్పొరేటర్ల ప్రశ్నలు, వైసీపీ సభ్యుల ఎదురుదాడితో.. కౌన్సిల్ సమావేశంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న ఐ ప్యాక్‌ టీం సభ్యులు.. ఇప్పుడు నేరుగా అధికారుల మధ్యే కూర్చున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం హాల్లో అధికారులతో పాటు ఐ ప్యాక్ సభ్యులు దర్జాగా కూర్చున్నారు. వారిని గమనించిన తెలుగుదేశం కార్పొరేటర్లు ఎవరు? ఎందుకు కూర్చున్నారని ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదు.

వెంటనే అప్రమత్తమైన వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వారికి రక్షణగా నిలబడి బయటకు తీసుకెళ్లి.. మేయర్ ఛాంబర్లో కూర్చోబెట్టాలని భావించారు. మీడియా రావటంతో కార్పొరేషన్‌ హాల్లో ప్రజల గ్యాలరీకి పంపించారు. ఆ తర్వాత అక్కడ మీడియా చిత్రీకరిస్తుండటంతో బయటకు పంపించారు. వారిని ఏమీ చేయవద్దని మేయర్ పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు కూడా వారి జోలికి వెళ్లలేదు.

ఐ ప్యాక్ బృందాన్ని మీరెవరని మీడియా అడిగినా సమాధానం లేదు. వైసీపీ ప్రజాప్రతినిధులపై నమ్మకం లేకే సీఎం జగన్ ఐప్యాక్ బృందాన్ని కౌన్సిల్ సమావేశాలకు పంపారని తెలుగుదేశం ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా బయటి వ్యక్తులు సమావేశాల్లో ఎలా పాల్గొంటారని ప్రతిపక్ష కార్పొరేటర్లు నిలదీశారు.

"అధికారులతోపాటు కలిసి ఈ ఐ ప్యాక్​ టీం కూర్చున్నారు. మేము దీనిపై నిలదీసినప్పుడు.. దొంగలను పోలీసులు దాచిపెట్టినట్లు.. తీసుకెళ్లి వెనకాల గ్యాలరీలో కూర్చోపెట్టారు. ఐ ప్యాక్​ సభ్యులు ఉన్నారని వీరు ఇలా ప్రవర్తిస్తున్నారు" -శ్రీరాంప్రసాద్‌, టీడీపీ కార్పొరేటర్‌

వైసీపీ నేతలు మాత్రం ఎదురుదాడికి దిగారు. సమావేశం గురించి తెలుసుకోవటానికి వచ్చి ఉంటారని.. కుర్చీలు ఖాళీగా ఉన్నాయని అధికారుల వద్ద కూర్చున్నారని కుంటిసాకులు చెప్పారు. ఎక్కడ కూర్చోవాలో తెలియక ఇక్కడ కూర్చున్నారు తప్పా.. తెలిసి కూర్చోలేదని సముదాయించుకొచ్చారు. వారు ఎవరో తెలియదన్నట్లుగా వైసీపీ నేతలు సమాధానమిచ్చారు.

"వారు ఎక్కడు కూర్చోవాలో తెలియక.. సమావేశంలో కూర్చున్నారు. ప్రతిపక్ష నేతలు పాయింటవుట్​ చేసిన తర్వాత.. తర్వాత వారి స్థానంలోకి వెళ్లి వారు కూర్చున్నారు. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేమి లేదు." -చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ

టీడీపీ కార్పొరేటర్లపై వైసీపీ కార్పొరేటర్ల దాడి: అంతకుముందు సమావేశం ప్రారంభానికి ముందే తెలుగుదేశం కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోవటం లేదని ఖాళీ కుండలతో ఆందోళన చేపట్టారు. కుండలు పగులగొట్టి నిరసనకు దిగారు. ఆ తర్వాత సమావేశంలోనూ నగరంలో మంచినీటి ఇబ్బందుల్ని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఐతే తాగునీటి సమస్య ఉన్నట్లు నిరూపించాలని మేయర్ సవాల్ విసరటం వాదోపవాదాలకు దారితీసింది. ప్రశ్నిస్తున్న తెలుగుదేశం కార్పొరేటర్లపైకి దూసుకొచ్చిన వైసీపీ కార్పొరేటర్లు.. దాడికి యత్నించారు. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం ఎమ్మెల్యేలు, తోటి సభ్యులు కలగజేసుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో.. పరిస్థితి సద్దుమణిగింది.

ప్రొటోకాల్‌ పాటించటం లేదని, తనను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవటం లేదంటూ డిప్యూటీ మేయర్ సజీలా మేయర్‌ని ప్రశ్నించారు. వీధి కుక్కల కారణంగా నగరంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన ఆమె.. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి ఫొటో ప్లెక్సీని ప్రదర్శించారు. ఎమ్మెల్యే ముస్తఫా కూడా నగరంలో అభివృద్ధి పనుల విషయంపై అధికారులు తమతో చర్చించటం లేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details