KTR to Inaugurate Hyderabad Book Exhibition: పుస్తక ప్రియులకు అత్యంత ఇష్టమైన జాతీయ పుస్తక మహోత్సవం హైదరాబాద్లో మళ్లీ వచ్చింది. 35వ జాతీయ పుస్తక ప్రదర్శన ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో మొదలుకానుంది. ఇందులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. నేటి నుంచి వచ్చే నెల 1వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఏటా ఈ పుస్తక మహోత్సవానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి పబ్లిషర్స్తో పాటు పుస్తక ప్రియులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ పుస్తక ప్రదర్శనను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక ప్రాముఖ్యత తగ్గలేదని, పుస్తకం ఒక తల్లి పాత్ర పోషిస్తుందని సాహిత్య అకాడమీ ఛైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.
ఈ పుస్తక ప్రదర్శనలో 300 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టారు. వేదికకు కవి అలిశెట్టి ప్రభాకర్ పేరు ఖరారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, ప్రముఖుల జీవిత చరిత్ర సహా వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమంత్రి స్టాల్లో, కేసీఆర్పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర హిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ సహా ఇతర భారతీయ భాషల సాహిత్యంతోపాటు నవలలు, కథలు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి.