Metro Stopped Due To Technical Issue: హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలతో చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీతో నగరవాసులు మెట్రో ప్రయాణానికే ఆసక్తి చూపుతున్నారు. కానీ కొన్ని సార్లు సాంకేతిక కారణాలతో మెట్రో సేవలకు అంతరాయం కలుగుతుంది. తద్వారా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజాగా సాంకేతిక లోపంతో తెలంగాణలోని ఎర్రమంజిల్లో మెట్రో రైలు నిలిచిపోయింది. అందులోని ప్రయాణికులను.. సిబ్బంది మరో రైలులోకి తరలించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుండగా.. సాంకేతిక సమస్య తలెత్తినట్టు అధికారులు గుర్తించారు. ఆఫీసులకు, వివిధ పనులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.