Robo tractor: చిన్నపాటి యుద్ధ ట్యాంకర్లా కనిపిస్తోన్న ఈ పరికరం.. వ్యవసాయానికి సంబంధించి ఐదు రకాల పనుల్ని అవలీలగా చేస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ అంకుర సంస్థ ఈ రోబో పరికరాన్ని రూపొందించింది. క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు రైతులకు రోబో సాంకేతికత గురించి వివరించేందుకు గుంటూరు తీసుకువచ్చారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు పరికరం తీరుని ప్రదర్శించి చూపారు. ప్రస్తుతం రైతులు ఏ పంట వేసినా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆ సమస్య తీర్చటం కోసం రకరకాల ఉపకరణాల్ని వాడుతున్నారు. ముఖ్యంగా పురుగుమందుల పిచికారి కోసం డ్రోన్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అది కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇపుడీ రోబో ట్రాక్టర్ డ్రోన్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చారు. పురుగు మందుల పిచికారితో పాటు విత్తనాలు వేయటం, మొక్కలు నాటడం, కలుపు తీయటం, ఎరువులు చల్లటం వంటి పనులు దీనితో చేయొచ్చు.
చిన్నపాటి ట్రాక్టర్ లాంటి పరికరానికి పనికి తగ్గట్లుగా ఐదు రకాలు ఉపకరణాల జోడిస్తారు. ఏ పొలంలో అయితే పనులు చేయాలో ఆ పొలాన్ని ముందుగా మ్యాపింగ్ చేసి.. ఏ పని చేయాలో సంబంధిత ఉపకరణాన్ని జోడిస్తే చాలు ఈ రోబో పని పూర్తి చేస్తుంది. రైతులకు సాంకేతికతను దగ్గర చేసేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు పరికరం రూపకర్తలు తెలిపారు. రోబోటిక్స్‌తో వ్యవసాయంలోని చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుందని తయారీదారుల్లో ఒకరైన త్రివిక్రం కుమార్ తెలిపారు. రోబో ట్రాక్టర్ రిమోట్ ద్వారా పని చేస్తుంది. 3గంటల ఛార్జింగ్ చేస్తే 5 నుంచి 6 గంటలు పని చేస్తుంది. అదనపు బ్యాటరీ తీసుకుంటే మరో 2గంటలు నడుస్తుంది. అలా 8 గంటల్లో 4 ఎకరాల్లో పురుగుమందుల పిచికారీ పూర్తి చేయొచ్చు. ఇతర రకాల పనులైతే రెండు ఎకరాల్లో చేయగలదని.. రూపకర్తలు తెలిపారు.