ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో తీవ్రస్థాయికి కరోనా..ఈ నెలలో 8 రెట్లు అధికం - guntur district latest news

రెండో దశలోనూ గుంటూరు జిల్లాను కరోనా వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. మహమ్మారి కట్టడికి అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఈనెలలోనే ఇప్పటిదాకా కేసుల సంఖ్య 8 రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

huge-corona-cases-registered-in-guntur-district
గుంటూరు జిల్లాలో తీవ్రస్థాయికి చేరిన కరోనా

By

Published : Apr 25, 2021, 7:24 AM IST

గుంటూరు జిల్లాలో తీవ్రస్థాయికి చేరిన కరోనా విజృంభణ

రెండో దశలోనూ గుంటూరు జిల్లాలో కరోనా వైరస్‌ స్వైరవిహారం చేస్తోంది. జనవరి, ఫిబ్రవరిలో వైరస్ తీవ్రత సాధారణంగానే ఉన్నా మార్చిలో మాత్రం తీవ్రరూపు దాల్చింది. ఏప్రిల్‌లో అడ్డూ అదుపు లేకుండా కేసులు పెరిగిపోతున్నాయి. మార్చిలో 2వేల219 పాజిటివ్‌ కేసులు నమోదవగా ఈ నెలలో ఇప్పటిదాకా 16వేల మందికిపైగా వైరస్‌ నిర్థరణైంది. మార్చితో పోలిస్తే కేసుల్లో 637శాతం పెరుగుదల కనిపిస్తోంది. కేవలం 24 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో కొవిడ్‌ బారినపడడం అధికారులను కలవరపెడుతోంది.

ఆంక్షలు విధించినప్పటికీ...

శనివారం ఒక్కరోజే జిల్లాలో 15వందల 81 కేసులు వచ్చాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 94వేల 306కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో 7వేల 620 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న వారు ఫలితం వచ్చే వరకు ఇళ్లల్లో ఉండకుండా బయట తిరుగుతున్నారు. కొందరిలో వైరస్ ఉన్నా లక్షణాలు కనిపించడం లేదు. దీనివల్ల మహమ్మారి వ్యాప్తి పెరిగిపోతోంది. గుంటూరు నగరంలో వైరస్‌ కట్టడికి అధికారులు ఎక్కడికక్కడ మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. దుకాణాల సమయాలను సాయంత్రం 6గంటల వరకే కుదించారు. కానీ.. రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు.

ఫలితాల వెల్లడిలో జాప్యం...

గతేడాది జిల్లాలో 76వేల 376 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 19వేల 549 మందికి పాజిటివ్‌ వచ్చింది. గతేడాది ఆగస్టులో అత్యధికంగా 21వేల 443 కేసులు రాగా..ప్రస్తుతం అలాంటి తీవ్రత మళ్లీ కనిపిస్తోంది. 4 రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవడంతో కొవిడ్ పరీక్షల సంఖ్యను అధికారులు భారీగా పెంచారు. రోజుకు 6వేల మంది నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ కోసం వచ్చే వారితో పరీక్షా కేంద్రాలు నిండిపోతున్నాయి. దీని వల్ల ఫలితాల కోసం మూడు, నాలుగు రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. జిల్లాలో కొవిడ్ చికిత్స అందించే ఆస్పత్రులు 53 ఉన్నాయి. వీటిలో 6వేల వరకు పడకలున్నా అవన్నీ రోగులతో నిండిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ల్యాబ్​ల్లో జేసీ తనిఖీలు...

మరోవైపు కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో జాప్యం జరుగుతోందని ఫిర్యాదుల నేపథ్యంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రైవేటు ల్యాబ్​లను తనిఖీ చేశారు. మూడు ల్యాబ్​లను పరిశీలించిన ఆమె.. ఐసీఎంఆర్‌‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. త్వరితగతిన నివేదికలు అందజేయాలని సూచించారు. నిబంధనలు పాటించని రెండు ల్యాబులకు జరిమానా విధించామని గుర్తు చేసిన జేసీ... నిబంధనలకు విరుద్ధంగా ఎవరి వద్ద అధిక రుసుము తీసుకోరాదని హెచ్చరించారు.

ఇవీచదవండి.

ప్రభుత్వాసుపత్రి సిబ్బంది చేతివాటం.. కాసులిస్తేనే పడక, మెరుగైన వైద్యం!

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ శాంతన​గౌడర్ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details