ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీలకు చట్టపరంగా వచ్చిన రిజర్వేషన్లు ఎలా తగ్గిస్తారు'

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతటి గందరగోళం ఎప్పుడూ లేదని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇష్టారీతిన నోటిఫికేషన్‌ విడుదల చేశారన్న ఆయన.... బీసీల రిజర్వేషన్లను 10 శాతానికి తగ్గించారన్నారు. బలహీనవర్గాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌పై ధ్వజమెత్తారు.

బీసీలకు చట్టపరంగా వచ్చిన రిజర్వేషన్లు ఎలా తగ్గిస్తారు
బీసీలకు చట్టపరంగా వచ్చిన రిజర్వేషన్లు ఎలా తగ్గిస్తారు

By

Published : Mar 7, 2020, 5:24 PM IST

ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యామని తెదేపా అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల బీసీ రిజర్వేషన్లు గణనీయంగా పడిపోయాయని ఆరోపించారు. చట్ట పరంగా వచ్చేవి తీసేసి బీసీ ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్ మిగిలారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలోని 16 మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా బీసీలకు రిజర్వ్ కాలేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్.. మంత్రులను బెదిరించడం కుట్రలో భాగమేనని ఆరోపించారు.

ఎన్నికల కమిషనర్ అలా ఎలా చెబుతారు

మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవం అవుతాయని ఎన్నికల కమిషనర్ ఎలా మాట్లాడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ ఊడిగం చేస్తారా అని నిలదీశారు. గ్రామాల్లో ప్రజాస్వామ్యం ఉండక్కర్లేదని ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారా అని దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలాన్ని నిన్న ఎస్టీ అని... నేడు జనరల్ అని ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు.

నిఘా యాప్​నకు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి?

ముఖ్యమంత్రి సూపర్ ఎలక్షన్ కమిషనర్​గా వ్యవహరిస్తున్నారని.. చరిత్రలో ఇంతటి గందరగోళం ఎప్పుడూ లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించటమేనని ఆక్షేపించారు. నిఘా యాప్​నకు, ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు.

మద్యం నిలిపివేయాలి

గత 9 నెలలుగా ఏం అభివృద్ధి చేశారని ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 151 సీట్లిస్తే జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందర్నీ రోడ్డెక్కించి, ఇబ్బందుల పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి మద్యాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎన్నికల కమిషనర్​ను కలుస్తామన్నారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు జగన్ యత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వారి కుట్రలకు భయపడవద్దని తెదేపా నేతలకు సూచించారు. పార్టీ తరఫున కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా... 79950 14525 నంబర్​కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు.

కుట్రలు చేస్తున్నారు

అశోక్ గజపతిరాజు కుటుంబ వ్యవహారంలో వీళ్ల జోక్యం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో బాబ్జీ ఆత్మహత్యాయత్నానికి పోలీసులు సిగ్గుపడాలన్నారు. ప్రకాశం జిల్లా తెదేపా నాయకుల గ్రానైట్ వ్యాపారాలు, జయదేవ్, పంచుమర్తి వ్యాపారాలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లొంగిపోయి ఊడిగం చేయటానికే ఏకగ్రీవం బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఇదీ చదవండి:

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details