ఇప్పటి జాతీయ పతాకానికి మాతృక పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకమే. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చిన ఈ జెండా 1921 లో ప్రాణం పోసుకుంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, ఇతరత్రా నాయకులు జాతీయ పతాకాలు రూపొందించినా... అవి సామాన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ పింగళి రూపొందించిన ఈ పతాకమే.. జాతీయోద్యమానికి దిక్సూచి అయ్యింది. నేటి భారత జాతికి హృదయ పతాకంగా నిలిచింది.
ఒక జాతికీ, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికీ పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్యకు 1906లోనే కలిగింది. దీనికి కారణం కోల్‌కతాలో 1906లో జరిగిన 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభ. సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్ వారి పతాకమైన యూనియన్ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడం ...పింగళి వెంకయ్యను కలత పరిచింది.
ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనసులో మెదిలింది. ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంకయ్య ప్రతిభను గుర్తించిన పెద్దలు ..ఆయన్ని కాంగ్రెస్ విషయ నిర్ణయ సమితి సభ్యునిగా నియమించారు. ఆనాటి నుంచి జాతీయ జెండా ఎలా ఉండాలనే ఆంశాన్నే తన అభిమాన విషయంగా పెట్టుకొని...దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై …నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పనపై చర్చలు జరిపారు. జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య 1916లో ...భారతదేశానికి ఓ జాతీయ పతాకం అనే ఆంగ్ల పుస్తకాన్ని సైతం రచించారు.
మెుదట 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ పతాకంపై రాట్నం చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ అంగీకరించారు. ఆ తర్వాత 1921 మార్చి 31న .. విజయవాడలో ప్రస్తుతమున్న బాపూ మ్యూజియం.. నాడు విక్టోరియా మహల్‌లో మహాత్మాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పనపై పలుమార్లు చర్చించారు. ఈ సమావేశంలో వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతను బాపూజీ అప్పగించారు.