వైకాపా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకే పెద్దపీట వేస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేటలో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామం వద్ద 100 ఎకరాలలో ఏర్పాటుచేసిన ఇళ్లస్థలాలలో నరసరావుపేట పట్టణ పరిధిలోని 6,016 మంది పేద లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను అందజేశారు.
ముఖ్య అతిథిలుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖామంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకూ అందించిన సంక్షేమ పథకాలన్నీ మహిళలకే అందజేశామని.. మహిళలు సైతం ఆస్తిపరులుగా మారి కుటుంబాలకు పెద్దదిక్కులా ఉండాలని ఎంపీ సూచించారు. ప్రస్తుతం పేదలకు అందిస్తున్న ఇళ్లపట్టాలు గత ప్రభుత్వాలలా కాకుండా మహిళల పేరుతో రిజిస్ట్రేషన్చేస్తున్నామని ఎంపీ తెలిపారు. మహిళల కుటుంబాలకు ఆపద సమయంలో బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే సౌకర్యం ఉండేలా వైకాపా ప్రభుత్వం ఇళ్లపట్టాలను అందిస్తుందన్నారు.