వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల పథకంలో భాగంగా.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామానికి చెందిన లబ్ధిదారు నరాల రత్నకుమారి రాష్ట్రంలోనే మొదటిగా.. రెండో కేటగిరీ కింద ఇంటిని నిర్మించారు. ఈ విధానం ప్రకారం ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందజేస్తుంది. నిర్మాణానికి కావలసిన సామగ్రిని లబ్ధిదారే సమకూర్చుకోవాలి. ఈ గృహాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారు రత్నకుమారి మాట్లాడుతూ.. గత నెల 25న అధికారులు ఇంటి పట్టా అందజేశారన్నారు. 24 రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. ఇందుకు అధికారులు సహకరించారని వెల్లడించారు. ప్రభుత్వ సాయంతోపాటు తమ వ్యయం కలిపి మొత్తం రూ.3 లక్షలైందని తెలిపారు. రెండో కేటగిరీ కింద రాష్ట్రంలోనే మొదటిగా రత్నకుమారి ఇల్లు నిర్మించారని గృహ నిర్మాణశాఖ ఏఈ ఆర్.వి.సుబ్బారావు పేర్కొన్నారు.