ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాధి నిర్ధరణ పరీక్షల్లో కోత.. రోగులకు అందని సరైన వైద్యం - ఆంధ్రప్రదేశ్ వార్తలు

Lack of Facilities for Diagnostic Tests: ఓ పక్క.. ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు విస్తృతం చేశామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటనలు చేస్తుంటే.. మరోపక్క ఆసుపత్రుల్లో అరకొర రోగనిర్ధరణ పరీక్షలు వెక్కిరిస్తున్నాయి. చాలా వరకు జిల్లాల్లోని బోధనాసుపత్రుల్లో.. రోగ నిర్ధరణ పరీక్షల కోసం ప్రైవేట్ కేంద్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా సంస్థలకు భారీగా బకాయిలు పడటంతో.. వారు రోగనిర్ధరణ పరీక్షలు చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి రోగ నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకే పరిమితం కావాల్సి వస్తోంది.

Lack of Facilities for Diagnostic Tests
రోగనిర్ధారణ పరీక్షలకు సౌకర్యాల కొరత

By

Published : Apr 10, 2023, 7:28 AM IST

Updated : Apr 10, 2023, 9:58 AM IST

వ్యాధి నిర్ధరణ పరీక్షల్లో కోత.. రోగులకు అందని సరైన వైద్యం

Lack of Facilities for Diagnostic Tests: ‘ఫ్యామిలీ డాక్టర్‌’తో పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాం.. గతంలో కంటే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను విస్తృతం చేశాం.. అని ఈ నెల 6వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పుకొచ్చారు. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఈ మాటలు అస్సలు అతకడం లేదు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే రోగులకు ప్రైవేటు సంస్థల్లో చేయించాల్సిన రోగ నిర్ధరణ పరీక్షల సంఖ్యను తగ్గించాలని.. సాక్ష్యాత్తూ కాకినాడ జీజీఎచ్ సూపరింటెండెంటే వైద్యులకు ఆదేశాలివ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. బిల్లులు భారీగా బకాయిలున్నాయన్న ఆయన.. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న రోగ నిర్ధరణ పరీక్షలతో చికిత్సలను సరిపెట్టమని చెప్పడం.. సమస్య తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.

మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద చేరిన పేద రోగులకు.. వ్యాధి నిర్ధరణ పరీక్షల్లో కోత విధిస్తున్నారు. స్పెషాల్టీ, సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందుబాటులో ఉన్నా.. వ్యాధి నిర్ధరణ పరీక్షలు అరకొరగానే సాగుతుండటంతో.. రోగులకు సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. చాలా హాస్పిటల్స్​లో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంలో అందించే సేవలకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు.

బోధనాసుపత్రుల్లో డయాలసిస్‌ సేవలు అందించే ఓ ప్రైవేట్‌ సంస్థకు నాలుగైదు నెలలుగా బిల్లులు ఇవ్వలేదు. ఇలాంటి బకాయిలు కోట్లలో ఉన్నాయి. దీంతో ప్రైవేట్‌ ఏజెన్సీల నిర్వాహకులు ఆయా సర్సీస్​లను నిలిపివేస్తామని అధికారులకు తేల్చిచెప్పేస్తున్నారు. బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారు రోగులకు సేవలు మెరుగుపరచడంపై దృష్టిపెట్టలేకపోతున్నారు.

కాకినాడ జీజీఎచ్​లో రోజూ ఓపీలో సుమారు 2 వేల మంది సేవలు పొందుతున్నారు. సుమారు 12 వందల మంది ఇన్‌పేషెంట్లుగా ఉంటారు. మూడు, నాలుగు జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందించే ముఖ్యమైన జీజీహెచ్‌లో.. ఎడాదిన్నరగా ఎమ్మారై సదుపాయం లేదు. థైరాయిడ్, సికిల్‌సెల్‌ ఎనీమియా రోగులకు అవసరమైన ముఖ్యమైన పరీక్షలు కూడా చేయడం లేదు. దీంతో జీజీహెచ్‌.. వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం ఆసుపత్రి వెలుపల నాలుగైదు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.

ఎమ్మారై, థైరాయిడ్, ఇతర పరీక్షలను ఆ ప్రైవేట్‌ సెంటర్లలో చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఇలా పరీక్షలు చేసిన ప్రైవేట్‌ కేంద్రాల వారికి ప్రభుత్వం 3 కోట్ల రూపాయల వరకు బకాయి పడింది. బిల్లులు చెల్లించకపోవడంతో ఓ సంస్థ ఇక పరీక్షలు చేయించలేమని చెప్పేసింది. మిగిలిన సంస్థలు కూడా బకాయిలు చెల్లించాలని ఆసుపత్రి పర్యవేక్షణ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. ప్రైవేట్‌ కేంద్రాల వారికి చెల్లించాల్సిన బకాయిలు చాలాకాలంగా పెండింగులో ఉన్నాయి కాబట్టి బయట కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని రోగులకు రాయడం తగ్గించాలని.. ఆసుపత్రిలో ఉన్న పరీక్షలు మాత్రమే రాయండంటూ.. జీజీఎచ్ సూపరింటెండెంట్‌.. ఆసుపత్రి విభాగాధిపతులు, వైద్యులకు వాట్సప్‌ సందేశం పంపడం చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖ కేజీఎచ్​లోనూ ఎమ్మారై సౌకర్యం లేదు. ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీ రోగులకు ఎమ్మారై స్కానింగ్‌తోపాటు ముఖ్యమైన రక్త, ఇతర పరీక్షలు చేయడానికి ప్రైవేట్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. బకాయిపడ్డ బిల్లులు పెరిగిపోతుండటంతో.. కర్నూలు, విజయవాడ జీజీహెచ్‌ల నుంచి ఎమ్మారై పరీక్షలు అంతంతమాత్రంగానే చేయిస్తున్నారు.

మరోవైపు కర్నూలు జీజీహెచ్‌లో థైరాయిడ్, ఎల్‌ఎఫ్‌టీ వంటి పరీక్షలకు అవసరమైన కిట్లు కొద్దిమొత్తంలోనే ఉండటంతో కొరత ఏర్పడుతోంది. గుంటూరు జీజీహెచ్‌తోపాటు ఇతర బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీలో వైద్యసేవలను విస్తృతపరిచామని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు.. అవసరమైన నిర్ధరణ పరీక్షలు చేయకుండా నామమాత్రపు ట్రీట్​మెంట్​తో సరిపెట్టేస్తే పేదల ఆరోగ్యం ఏం కావాలో సమాధానం చెప్పాలి.

బోధనాసుపత్రుల్లో రోజువారీ నిర్వహణకు నిధుల్లేక.. ఉన్నవి చాలక సూపరింటెండెంట్లు సతమతమవుతున్నారు. విశాఖ కేజీహెచ్‌లో 56 లక్షలు, తిరుపతి రుయాలో 25 లక్షలు, విజయవాడ జీజీహెచ్‌లో 24 లక్షలు, గుంటూరు జీజీహెచ్‌లో 19.50 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు, కర్నూలులో 14 లక్షలు, ఒంగోలులో 14 లక్షలు, కడప జీజీహెచ్‌లో 12 లక్షలు, శ్రీకాకుళం జీజీహెచ్‌లో 2 లక్షల రూపాయల చొప్పున మాత్రమే నిర్వహణ నిధులు అందుబాటులో ఉన్నాయి.

జిల్లా కలెక్టర్లు వీటికి ఛైర్మన్లుగా ఉంటున్నారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ నిధి నుంచి వాడుకోండి.. తర్వాత సర్దుబాటు చేస్తామని చెబుతున్న ఉన్నతాధికారులు తర్వాత సైలెంట్​ అయిపోతున్నారు. ఆసుపత్రుల నిర్వహణలో ఏదైనా అత్యవసర ప్రాబ్లమ్ వస్తే ఈ అరకొర నిధి నుంచి సర్దుబాటు చేయలేక అధికారులు హైరానా పడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 10, 2023, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details