చూడటానికి చక్కగా ఉన్నాడు. పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అంటూ మాయ మాటలు చెప్పి సంసారానికి పనికిరాని వ్యక్తితో వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాధిత యువతి సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరావుపేటకు చెందిన ఓ మహిళ తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తోంది. తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి గుంటూరుకు చెందిన యువతితో మే 26న వివాహం జరిపించారు.
కట్నంగా రూ. ఆరు లక్షలు, పెళ్లికి మరో రూ.రెండు లక్షలు ఖర్చు చేయించారు. తన కుమారుడి తొలిరాత్రి భువనేశ్వర్‌లో జరగాలని అత్త ఒత్తిడి చేసింది. అందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నర్సరావుపేటలో ఏర్పాటు చేశారు. తొలిరాత్రి రోజు యువకుడు వింత ప్రవర్తనలు, విచిత్ర ధోరణితో వ్యవహరించడంతో ఆ యువతి నిశ్చేష్టురాలైంది. ఆమె దగ్గరకు వచ్చిన అతను ఈ వయసులో కోరికలు ఎక్కువ ఉండకూడదంటూ మాత్ర వేసుకొని నిద్రపోయాడు.
అదే తరహాలో మూడు రాత్రులు వ్యవహరించడంతో ఆమెకు అనుమానం వచ్చి నిలదీసింది. అప్పుడు అతను భార్య, భర్తలు అంటే శారీరక సంబంధం పెట్టుకోవడం కాదని.. మనం మంచి స్నేహితులుగా ఉందామనడంతో ఆమె నిర్ఘాంతపోయింది. ఆ రోజు తను మింగే మాత్రలు అయిపోయాయి. ఆ మాత్రలు వేసుకోకపోతే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందన్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదు. మానసిక స్థితి సరిగాలేదంటూ తెలపడంతో విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. వాళ్లు వచ్చి అత్తను ప్రశ్నిస్తే తన కుమారుడు ఆరోగ్యవంతుడేనని, తలనొప్పికి మాత్రలు వేసుకుంటున్నాడు కావాలంటే తాము చికిత్స చేయించుకునే వైద్యుడిని అడగండంటూ జీజీహెచ్ పర్యవేక్షకులుగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వైద్యులకు ఫోన్ ఇచ్చింది. ఆ యువతి వైద్యుడిని ప్రశ్నించగా ఆయన విస్తుపోయే వాస్తవాలు తెలిపారు.