నిమ్మగడ్డ రమేశ్ కుమార్తో హైదరాబాద్లోని ఓ హోటల్లో ఇద్దరు భాజపా నేతలు భేటీ కావడాన్ని హోంమంత్రి సుచరిత ఖండించారు. ఈ కలయికపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రమేశ్ కుమార్ వ్యవహారంలో కోర్టులో వాదనలు నడుస్తుండగా భాజపా నేతల కలయిక దేనికి సంకేతమని సుచరిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదో కుట్రకు తెరతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. వీరి భేటీ వెనుక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందన్నారు.
'వారు వ్యక్తిగతంగా కలిసుంటే పర్వాలేదు. కానీ కోర్టులో కేసు నడుస్తుండగా రమేశ్ కుమార్ రాజకీయ నేతలను హోటల్లో ఎందుకు కలిశారు. వారితో గంటన్నర సేపు ఏం చర్చించారు. వారి కలయిక దేనికి సంకేతం. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలి. వీరి భేటీ వెనుక తెదేపా అధినేత చంద్రబాబు హస్తం ఉందని మాకు అనుమానంగా ఉంది.' - మేకతోటి సుచరిత, హోంమంత్రి